స్కూల్ ఎగ్గొట్టి యాదగిరి గుట్టకు.. తొమ్మిదో తరగతి విద్యార్థినులపై ముగ్గురు యువకుల అఘాయిత్యం

  • మాటలు కలిపి వెంట తీసుకెళ్లిన ముగ్గురు యువకులు
  • లాడ్జిలో తమపై అత్యాచారం జరిగిందని బాలికల ఆరోపణ
  • ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసిన అల్వాల్ పోలీసులు
  • పోక్సో చట్టం కింద కేసు నమోదు
  • గది అద్దెకు ఇచ్చిన లాడ్జి యజమాని కూడా అరెస్ట్
సరదాగా గడిపేందుకు స్కూల్‌ మానేసి బయటకు వెళ్లిన ముగ్గురు బాలికలు లైంగికదాడికి గురయ్యారు. బడికి వెళ్తున్నామని చెప్పి ఇంట్లోంచి వచ్చిన విద్యార్థినులను మాటల్లో పెట్టిన కొందరు యువకులు, వారిని యాదగిరిగుట్టకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటనలో నిందితులైన ముగ్గురు యువకులతో పాటు వారికి సహకరించిన లాడ్జి యజమానిని కూడా పోలీసులు అరెస్టు చేశారు.

అల్వాల్ పోలీసుల కథనం ప్రకారం.. తొమ్మిదో తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు ఈ నెల 20న పాఠశాలలో బతుకమ్మ వేడుకలున్నాయని తల్లిదండ్రులకు చెప్పారు. ఉదయాన్నే ఇంటి నుంచి బయలుదేరి, స్కూల్‌కు వెళ్లకుండా సికింద్రాబాద్ మీదుగా ఉస్మానియా యూనివర్సిటీ ప్రాంతానికి చేరుకున్నారు. అక్కడ బస్టాప్‌లో ఉన్న బాలికలతో జీహెచ్‌ఎంసీలో కాంట్రాక్టు ఉద్యోగి అయిన ఓ 19 ఏళ్ల యువకుడు మాటలు కలిపాడు. తన ఇద్దరు స్నేహితులను కూడా అక్కడికి పిలిపించాడు. తాము కూడా యాదగిరిగుట్టకే వెళ్తున్నామని బాలికలను నమ్మించి, మొత్తం ఆరుగురు కలిసి బస్సులో అక్కడికి బయలుదేరారు.

యాదగిరిగుట్టలో దర్శనం తర్వాత యువకులు ముగ్గురు ఒక లాడ్జిలో గదిని అద్దెకు తీసుకున్నారు. అదే గదిలో తమపై వారు అత్యాచారానికి పాల్పడ్డారని బాధిత బాలికలు ఆరోపించారు. మరుసటి రోజు, అంటే 21న తిరిగి హైదరాబాద్ వచ్చి బాలికలను ఓయూ వద్ద వదిలిపెట్టి నిందితులు వెళ్లిపోయారు. బాలికలు పాఠశాలకు రాకపోవడంతో ఉపాధ్యాయులు తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు.

ఆందోళన చెందిన తల్లిదండ్రులు అల్వాల్ పోలీసులకు ఫిర్యాదు చేయగా, వారు మిస్సింగ్ కేసు నమోదు చేశారు. మరుసటి రోజు బాలికలు తల్లిదండ్రులకు ఫోన్ చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. తల్లిదండ్రులు గట్టిగా నిలదీయడంతో జరిగిన దారుణాన్ని వారు వివరించారు. ఈ ఘటనపై తక్షణమే స్పందించిన పోలీసులు, ముగ్గురు నిందితులను గుర్తించి అరెస్టు చేశారు. వారిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. బాలికలు మైనర్లని తెలిసి కూడా గది ఇచ్చిన లాడ్జి యజమాని సోమేశ్‌ను కూడా అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.


More Telugu News