ఒక ఇంట్లో ఉన్నప్పుడు చిన్నచిన్న గొడవలు సహజం.. బజారున పడొద్దు: కేటీఆర్

  • విభేదాలను సామరస్యంగా పరిష్కరించుకోవాలన్న కేటీఆర్
  • జూబ్లీహిల్స్‌లో జరిగిన పార్టీ కార్యకర్తల సమావేశంలో కేటీఆర్ వ్యాఖ్యలు
  • కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆగ్రహం
  • హైదరాబాద్ అనాథ అయిపోయిందంటూ ఆవేదన
  • వర్షాలకు ముగ్గురు చనిపోయినా మంత్రులు పట్టించుకోలేదని విమర్శ
"ఒక ఇంట్లో ఉన్నప్పుడు చిన్నచిన్న గొడవలు సహజం. వాటిని సామరస్యంగా పరిష్కరించుకోవాలి కానీ, బజారున పడి కొట్లాడుకోవద్దు. కలిసికట్టుగా పనిచేయాలి" అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సూచించారు. జూబ్లీహిల్స్‌లో పార్టీ కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక హైదరాబాద్ నగరం అనాథగా మారిందని, నగరాన్ని పట్టించుకునే నాథుడే కరవయ్యాడని తీవ్రంగా ధ్వజమెత్తారు.

వర్షాలకు నగరంలో ముగ్గురు యువకులు కొట్టుకుపోయి మరణిస్తే వారిని పరామర్శించేందుకు ఒక్క మంత్రి కూడా రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల కోసం ముగ్గురు మంత్రులను నియమించిన ప్రభుత్వం, వర్షాలతో ఇబ్బందులు పడుతున్న ప్రజల కోసం ఎందుకు స్పందించడం లేదని కేటీఆర్ ప్రశ్నించారు. తాము 36 ఫ్లైఓవర్లు నిర్మిస్తే, ప్రస్తుత ప్రభుత్వం కనీసం రోడ్ల మీద గుంతలు కూడా పూడ్చలేని దుస్థితిలో ఉందని విమర్శించారు.

రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపుతప్పాయని, నేరాల రేటు 41 శాతం పెరిగిందని ఆరోపించారు. చందానగర్‌లో పట్టపగలే ఒక నగల దుకాణంలో దోపిడీ జరగడమే ఇందుకు నిదర్శనమని అన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి హయాంలో ప్రారంభించిన ఫీజు రీయింబర్స్‌మెంట్ పథకాన్ని తాము కొనసాగిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం నిధులు లేవని చెప్పి దాన్ని మూసివేసిందని కేటీఆర్ మండిపడ్డారు.

ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ప్రకటనతో 13 లక్షల మంది విద్యార్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందన్నారు. మిర్యాలగూడ కాంగ్రెస్ ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గన్‌మన్ ఒక లారీ యూరియాను బ్లాక్ మార్కెట్‌లో అమ్ముకున్నాడని, గన్‌మనే ఇలా చేస్తే ఇక ఎమ్మెల్యే ఎంత అవినీతికి పాల్పడి ఉంటారో అర్థం చేసుకోవచ్చని ఆరోపించారు.

కేసీఆర్ హయాంలో లక్ష మందికి ఇంటి పట్టాలు ఇస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం వేల ఇళ్లను కూలగొట్టిందని, ఇందిరమ్మ రాజ్యం అంటే ఇదేనా అని కేటీఆర్ నిలదీశారు. ఉపఎన్నికల తర్వాత ఇప్పుడు తిరుగుతున్న మంత్రులెవరూ కనిపించరని, ప్రజల కష్టాల కోసం పోరాడేది కేవలం బీఆర్ఎస్ పార్టీ మాత్రమేనని స్పష్టం చేశారు.


More Telugu News