Shankar Director: వెబ్‌సిరీస్‌లో అవకాశం పేరుతో యువతిని మోసం చేసిన దర్శకుడు... కేసు నమోదు!

Hyderabad Director Shankar booked for blackmailing actress after web series audition
  • సినీ రంగంపై ఆసక్తితో కాకినాడ నుంచి వచ్చిన 23 ఏళ్ల యువతి
  • ఆడిషన్ పేరుతో కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను చిత్రీకరించిన దర్శకుడు
  • సన్నివేశాలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన వైనం
  • యువతి తల్లిదండ్రుల వరకు చేరిన వీడియోలు

సినిమాల్లో అవకాశాల పేరిట యువతులను మోసం చేస్తున్న ముఠాల ఉదంతాలు హైదరాబాద్‌లో మరోసారి కలకలం రేపుతున్నాయి. వెబ్ సిరీస్ ఆడిషన్ పేరుతో ఒక యువతిని నమ్మించి, అసభ్యకర వీడియోలు చిత్రీకరించి వేధిస్తున్న ఒక డైరెక్టర్‌పై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది.


కేసు వివరాల్లోకి వెళితే... ఏపీలోని కాకినాడకు చెందిన 23 ఏళ్ల యువతి సినీ రంగంపై ఆసక్తితో హైదరాబాద్‌కు వచ్చి, యూసుఫ్‌గూడలోని తన స్నేహితురాలి వద్ద ఉంటూ అవకాశాల కోసం ప్రయత్నిస్తోంది. ఈ క్రమంలో శంకర్ అనే వ్యక్తి తాను డైరెక్టర్‌నని పరిచయం చేసుకుని, ఒక వెబ్ సిరీస్‌లో అవకాశం ఇప్పిస్తానని ఆమెను నమ్మించాడు. ఆడిషన్ పేరుతో ఆమెను తన కారులో ఎక్కించుకుని అసభ్యకరమైన డైలాగులు చెప్పించడమే కాకుండా, కొన్ని అభ్యంతరకర సన్నివేశాలను చిత్రీకరించాడు. అనంతరం ఆ వీడియోలను బాధితురాలి అనుమతి లేకుండా తన ఫేస్‌బుక్ ఖాతాలో పోస్ట్ చేశాడు.


ఆ వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయి, చివరకు ఆమె తల్లిదండ్రుల వరకు చేరడంతో, వారు యువతిని తీవ్రంగా మందలించారు. ఆందోళన చెందిన బాధిత యువతి ఆ వీడియోలను డిలీట్ చేయాలని డైరెక్టర్‌ను కోరగా, అతను అందుకు నిరాకరించడమే కాకుండా... మరిన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అప్‌లోడ్ చేస్తానని ఆమెను బ్లాక్‌మెయిల్ చేయడం ప్రారంభించాడు. దీంతో దిక్కుతోచని స్థితిలో యువతి జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితుడు శంకర్‌పై వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసిన పోలీసులు, దర్యాప్తును వేగవంతం చేశారు.

Shankar Director
Hyderabad crime
web series audition
cyber crime
Jubilee Hills police
Kakinada girl
Facebook video
online harassment
Telugu news
film industry

More Telugu News