బీజేపీ గూటికి చేరిన వైసీపీ ఎమ్మెల్సీ పోతుల సునీత

  • పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డా సమక్షంలో బీజేపీలో చేరిక
  • ఏడాది క్రితం వైసీపీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా
  • గతంలో టీడీపీ తరపున శాసనమండలి సభ్యురాలిగా బాధ్యతలు
వైసీపీకి రాజీనామా చేసిన ఎమ్మెల్సీ పోతుల సునీత బీజేపీలో చేరారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో పోతుల సునీత దంపతులు నిన్న బీజేపీ కండువా కప్పుకున్నారు. వైసీపీ నుంచి ఎమ్మెల్యే కోటాలో ఎమ్మెల్సీగా గెలిచిన పోతుల సునీత ఏడాది క్రితం ఎమ్మెల్సీ పదవికి, పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి రాజీనామా చేశారు.

పోతుల సునీత 2017లో తొలిసారి టీడీపీ తరపున ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు. 2019 ఎన్నికల్లో ఉమ్మడి ప్రకాశం జిల్లా చీరాల అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ప్రయత్నించారు. కానీ, టీడీపీ నుంచి టికెట్ దక్కలేదు. దీంతో 2020 నవంబర్‌లో ఆమె తెలుగుదేశం పార్టీకి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేసి నాటి అధికార వైసీపీలో చేరారు. ఆ పార్టీ నుంచి ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో మళ్లీ ఎమ్మెల్సీగా ఎన్నికయ్యారు.

గడచిన ఎన్నికల్లో వైసీపీ ఘోర పరాజయం పాలైన నేపథ్యంలో ఆమె పార్టీకి దూరంగా ఉంటూ వచ్చారు. ఆమె ఎమ్మెల్సీ పదవీ కాలం 2029 మార్చి వరకు ఉన్నప్పటికీ, ఏడాది క్రితం వైసీపీ ప్రాథమిక సభ్యత్వానికి, ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేశారు. అయితే ఆమె రాజీనామాను ఇంత వరకు ఆమోదించలేదని సమాచారం. ఇప్పటికీ శాసనమండలిలో వైసీపీ ఎమ్మెల్సీగానే ఆమె పేరు ఉంది.

టీడీపీలో చేరేందుకు ప్రయత్నించినా అధిష్ఠానం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించలేదని, ఈ క్రమంలో బీజేపీ గూటికి చేరినట్లుగా ప్రచారం జరుగుతోంది. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సమక్షంలో సునీత దంపతులు నిన్న విశాఖలో జరిగిన కార్యక్రమంలో బీజేపీ కండువా కప్పుకున్నారు. 


More Telugu News