సీఎస్కే చైర్మన్‌గా ఎన్. శ్రీనివాసన్... మళ్లీ తెరపైకి క్రికెట్ కింగ్‌మేకర్!

  • 80 ఏళ్ల వయసులో మళ్లీ క్రికెట్ పాలనలోకి తిరిగొచ్చిన బీసీసీఐ మాజీ చీఫ్
  • హోల్‌టైమ్ డైరెక్టర్‌గా కుమార్తె రూప గురునాథ్ బాధ్యతలు
  • ఫ్రాంచైజీపై శ్రీనివాసన్ కుటుంబం పూర్తి పట్టు
  • ధోనీతో సన్నిహిత సంబంధాలు... మరికొన్నేళ్లు కొనసాగనున్న ‘తలా’
  • విదేశీ లీగుల్లో సీఎస్కే విస్తరణపై శ్రీనివాసన్ ప్రత్యేక దృష్టి
భారత, అంతర్జాతీయ క్రికెట్‌లో ఒకప్పుడు అత్యంత శక్తిమంతమైన వ్యక్తిగా చక్రం తిప్పిన ఎన్. శ్రీనివాసన్ 80 ఏళ్ల వయసులో మళ్లీ కీలక బాధ్యతలు చేపట్టారు. ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) చరిత్రలో అత్యంత విజయవంతమైన ఫ్రాంచైజీల్లో ఒకటైన చెన్నై సూపర్ కింగ్స్ క్రికెట్ లిమిటెడ్ (సీఎస్‌కేసీఎల్) చైర్మన్‌గా ఆయన నియమితులయ్యారు. ఈ నియామకంతో ఆయన మరోసారి క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశంగా మారారు.

క్రిక్‌బజ్ నివేదిక ప్రకారం.. ఈ ఏడాది ఫిబ్రవరిలోనే శ్రీనివాసన్ సీఎస్‌కేసీఎల్ బోర్డులో డైరెక్టర్‌గా చేరగా, మే 10న చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు. ప్రపంచవ్యాప్తంగా క్రికెట్, ఫ్రాంచైజీల స్వరూపం మారుతున్న తరుణంలో ఈ మార్పులను సమర్థంగా ఎదుర్కొనేందుకు శ్రీనివాసన్ అనుభవం, వ్యూహాత్మక నైపుణ్యం అవసరమని సీఎస్‌కేసీఎల్ డైరెక్టర్ ఒకరు అభిప్రాయపడ్డారు. మరోవైపు, శ్రీనివాసన్ కుమార్తె రూప గురునాథ్‌ను ఆగస్టు 24న కంపెనీకి హోల్‌టైమ్ డైరెక్టర్‌గా నియమించారు.

ఈ నియామకాలతో చెన్నై సూపర్ కింగ్స్ ఫ్రాంచైజీపై శ్రీనివాసన్ కుటుంబం పట్టు మరింత బలపడింది. సంస్థలో శ్రీనివాసన్‌కు 4,27,400 షేర్లు ఉండగా, ఆయన భార్య చిత్ర శ్రీనివాసన్‌కు లక్షకు పైగా, కుమార్తె రూపకు 36,440 షేర్లు ఉన్నాయి. ఇండియా సిమెంట్స్ నుంచి సీఎస్కే పూర్తిగా వేరుపడిన నేపథ్యంలో యాజమాన్యం అంతా వారి కుటుంబం చేతిలోనే ఉంది. శ్రీనివాసన్, రూప గురునాథ్ నియామకాలను ఆమోదించేందుకు ఈ నెల 27న ఉదయం 11 గంటలకు కంపెనీ 11వ వార్షిక సాధారణ సమావేశం (ఏజీఎం) వర్చువల్‌గా జరగనుంది.

ప్రస్తుతం శ్రీనివాసన్ బహిరంగంగా పెద్దగా కనిపించనప్పటికీ ఫ్రాంచైజీ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొంటున్నారని సమాచారం. ముఖ్యంగా దక్షిణాఫ్రికా, అమెరికా వంటి విదేశీ లీగుల్లో సీఎస్కే జట్లను విస్తరించడంలో ఆయన కీలక పాత్ర పోషిస్తున్నారు. అంతేకాకుండా, దీర్ఘకాలిక ప్రయోజనాల కోసం హై-పెర్ఫార్మెన్స్ సెంటర్లు, అకాడమీలు ఏర్పాటు చేయాలని ఆయన బలంగా విశ్వసిస్తున్నట్టు తెలుస్తోంది.

శ్రీనివాసన్, భారత జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీ మధ్య ఉన్న ప్రత్యేక అనుబంధం గురించి తెలిసిందే. ఆయన ఇప్పటికీ ధోనీతో నిరంతరం టచ్‌లో ఉంటున్నారని, అంతర్గత సమావేశాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారని ఓ సీనియర్ అధికారి ధ్రువీకరించారు. ఈ పరిణామంతో 44 ఏళ్ల ధోనీ, మరో రెండు సీజన్ల పాటు ఆటగాడిగా సీఎస్కేలో కొనసాగే అవకాశాలున్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు.


More Telugu News