నాగర్‌కర్నూలు జిల్లాలో.. ముగ్గురు పిల్లల్ని పెట్రోల్ పోసి తగులబెట్టి... ఆపై తండ్రి ఆత్మహత్య

  • కల్వకుర్తి మండలంలో ఘటన
  • భార్యతో గొడవపడి గత నెల 30న పిల్లలతో బయటకు వెళ్లిన వెంకటేశ్వర్లు
  • ముగ్గురు పిల్లలను పెట్రోల్ పోసి తగులపెట్టినట్లు గుర్తించిన పోలీసులు
  • ఆ తర్వాత పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్న వెంకటేశ్వర్లు
తెలంగాణలోని నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదకర ఘటన చోటు చేసుకుంది. కుటుంబ కలహాల కారణంగా భర్త ఆత్మహత్య చేసుకోగా, అదృశ్యమైన ముగ్గురు చిన్నారుల మృతదేహాలు లభ్యమయ్యాయి. వెల్దండ మండలంలో ఎరువుల దుకాణం నిర్వహిస్తున్న గుత్తా వెంకటేశ్వర్లు భార్యతో గొడవపడి గత నెల 30న ముగ్గురు పిల్లలతో కలిసి ద్విచక్ర వాహనంపై బయటకు వెళ్ళాడు.

వెల్దండ మండలం పెద్దాపూర్ గ్రామ శివారులో వెంకటేశ్వర్లు మృతి చెంది కనిపించాడు. అతని పక్కనే పురుగుల మందు డబ్బా ఉండటంతో ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. అయితే, ముగ్గురు పిల్లల ఆచూకీ లభించలేదు. డిండి ప్రాజెక్టు పరిసరాల్లో తండ్రి, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు సంచరించినట్లు పోలీసులు గుర్తించారు.

బుధవారం వెంకటేశ్వర్లు మృతదేహం లభ్యమైన తర్వాత, చిన్నారుల ఆచూకీ గురువారం ఉదయం వరకు తెలియరాలేదు. పోలీసులు గాలింపు చర్యలు చేపట్టగా ఉప్పనుంతల మండలం సూర్యా తండా సమీపంలో వెంకటేశ్వర్లు చిన్న కుమార్తె వర్షిణి (6), కుమారుడు శివధర్మ (4) మృతదేహాలు, తాండ్ర సమీపంలో పెద్ద కుమార్తె మోక్షిత (8) మృతదేహం లభ్యమయ్యాయి. చిన్నారులను పెట్రోలు పోసి తగులబెట్టినట్లు పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు.


More Telugu News