క్వాంటం వ్యాలీతో వచ్చే ఉద్యోగాలివే.. భవిష్యత్ టెక్నాలజీపై మంత్రి లోకేశ్ కీలక ప్రకటన
- అమరావతిలో క్వాంటం వ్యాలీకి సీఎం చంద్రబాబు, కేంద్రమంత్రి జితేంద్ర సింగ్ భూమిపూజ
- క్వాంటం వ్యాలీతో రానున్న హై క్వాలిటీ ఉద్యోగాలను వివరించిన లోకేశ్
- ఐబీఎం, టీసీఎస్ సహా 14 దిగ్గజ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వ ఒప్పందాలు
- భారత క్వాంటం విప్లవానికి అమరావతి నాయకత్వం వహిస్తుందన్న లోకేశ్
అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగానే పరిమితం కాదని, ఇది సైన్స్, కంప్యూటేషన్, ఇన్నోవేషన్ రాజధానిగా రూపాంతరం చెందబోతోందని లోకేశ్ ప్రకటించారు. "మన యువత అత్యాధునిక సాంకేతికతను కేవలం ఉపయోగించే వారుగా కాకుండా, దానిని సృష్టించే నిర్మాతలుగా మారాలన్నదే మా లక్ష్యం. క్వాంటం, డీప్ టెక్, ఏఐ వంటివి అమరావతి కొత్త గుర్తింపును నిర్వచిస్తాయి. ఇది ప్రపంచ స్థాయి ప్రతిభను ఆకర్షించే నగరంగా, అత్యాధునిక టెక్నాలజీని ప్రపంచానికి ఎగుమతి చేసే కేంద్రంగా మారుతుంది" అని ఆయన పేర్కొన్నారు.
ఒకప్పుడు విజనరీ లీడర్ చంద్రబాబు నాయకత్వంలో హైదరాబాద్ ఐటీ విప్లవానికి ఎలా నాయకత్వం వహించిందో, ఇప్పుడు అదే స్ఫూర్తితో అమరావతి భారతదేశ క్వాంటం విప్లవానికి నేతృత్వం వహించబోతోందని లోకేశ్ ధీమా వ్యక్తం చేశారు. ఈ చరిత్రాత్మక కార్యక్రమంలో భాగంగా ఐబీఎం, టీసీఎస్, ఎల్&టీ వంటి 14 ప్రఖ్యాత సంస్థలు రాష్ట్ర ప్రభుత్వంతో అవగాహన ఒప్పందాలు (MoU) కుదుర్చుకున్నాయని వెల్లడించారు. ఇండస్ట్రీ, అకాడెమియా, స్టార్టప్‌ల భాగస్వామ్యంతో తదుపరి సాంకేతిక శకానికి ఏపీ నాయకత్వం వహించడానికి సిద్ధంగా ఉందని తెలిపారు.
భారతదేశంలోనే మొట్టమొదటి నేషనల్ క్వాంటమ్ రెఫరెన్స్ ఫెసిలిటీ అమరావతిలో ఏర్పాటవుతోందని లోకేశ్ తెలిపారు. సూపర్ కండక్టింగ్, ఫోటానిక్, ఐయాన్ ట్రాప్ వంటి బహుళ ప్లాట్‌ఫారమ్‌లు ఇక్కడ అభివృద్ధి కానున్నాయని వివరించారు. రాష్ట్రంలో ఇప్పటికే 50 వేల మంది విద్యార్థులు ఈ నూతన సాంకేతికతలపై శిక్షణ పొందుతున్నారని, దీర్ఘకాలంలో 10 లక్షల మంది యువతను నైపుణ్యవంతులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ ప్రాజెక్టులో భాగస్వాములైన ఐబీఎం, టీసీఎస్, ఎస్ఆర్ఎం యూనివర్సిటీ, క్యూపీఏఐ వంటి సంస్థలకు ఆయన ధన్యవాదాలు తెలిపారు. దిగ్గజ సంస్థల రాక, ప్రపంచ స్థాయి పరిశ్రమలు అమరావతిపై ఉంచిన నమ్మకానికి నిదర్శనమని లోకేశ్ పేర్కొన్నారు.
