కిమ్ ఆరోగ్యం రహస్యమా? పుతిన్‌తో భేటీ అనంతరం ఆయన తాకిన ప్రతి వస్తువునూ శుభ్రం చేసిన సిబ్బంది

  • పుతిన్‌తో భేటీ తర్వాత ఉత్తర కొరియా అధినేత కిమ్ ఆసక్తికర చర్యలు
  • ఆయన గది నుంచి వెళ్లగానే రంగంలోకి దిగిన సిబ్బంది
  • కిమ్ కూర్చున్న కుర్చీ, వాడిన గ్లాసును పూర్తిగా శుభ్రం చేసిన వైనం
  • ఆయన ఆనవాళ్లు దొరక్కుండా చేసేందుకే ఈ ప్రయత్నమని అభిప్రాయం
  • కిమ్ ఆరోగ్య రహస్యాలు కాపాడేందుకే ఈ భద్రత అని అంచనా
ఉత్తర కొరియా అధినేత కిమ్ జోంగ్ ఉన్ గది నుంచి బయటకు అడుగుపెట్టారో లేదో, ఆయన సిబ్బంది అత్యంత వేగంగా రంగంలోకి దిగారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో భేటీ ముగిసిన వెంటనే కిమ్ తాకిన ప్రతి వస్తువును వారు యుద్ధ ప్రాతిపదికన శుభ్రం చేశారు. తాజాగా వెలుగులోకి వచ్చిన ఓ వీడియోలో ఈ ఆసక్తికర దృశ్యాలు నమోదయ్యాయి.

బీజింగ్‌లో పుతిన్‌తో చర్చలు ముగిసిన తర్వాత కిమ్ అక్కడి నుంచి వెళ్లారు. వెంటనే ఆయన సహాయక సిబ్బందిలోని ఒకరు కిమ్ కూర్చున్న కుర్చీని, దాని చేతులు పెట్టుకునే భాగాలను తుడిచారు. మరో వ్యక్తి ఆయన నీళ్లు తాగిన గ్లాసును జాగ్రత్తగా ఒక ట్రేలో పెట్టుకుని తీసుకెళ్లిపోయారు. పక్కనే ఉన్న టేబుల్‌ను కూడా ఎలాంటి ఆనవాళ్లు మిగలకుండా పూర్తిగా శుభ్రం చేశారు. ఈ దృశ్యాలు చూస్తుంటే ఏదో ప్రమాదకర రసాయనాలను శుభ్రం చేస్తున్నంత హడావుడిగా కనిపించింది.

ఈ ఘటనపై రష్యాకు చెందిన జర్నలిస్ట్ అలెగ్జాండర్ యునాషెవ్ తన 'యునాషెవ్ లైవ్' ఛానెల్‌లో స్పందించారు. "చర్చలు ముగిశాక, ఉత్తర కొరియా అధినేత సిబ్బంది కిమ్ అక్కడ ఉన్నారనడానికి ఎలాంటి ఆధారాలు లేకుండా అన్నింటినీ జాగ్రత్తగా ధ్వంసం చేశారు" అని ఆయన తెలిపారు.

కిమ్ జోంగ్ ఉన్‌కు సంబంధించిన జీవసంబంధిత ఆనవాళ్లు (బయోలాజికల్ ఫుట్‌ప్రింట్) శత్రు దేశాల గూఢచారులకు చిక్కకూడదనే ఉద్దేశంతోనే ఈ చర్యలు తీసుకుంటున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. ఆయన వెంట్రుక, చర్మకణం, లేదా లాలాజలం వంటి వాటి ద్వారా డీఎన్ఏ సేకరించి, ఆయన ఆరోగ్య పరిస్థితిపై అంచనాకు రాకుండా ఉండేందుకే ఈ జాగ్రత్తలని తెలుస్తోంది.

ఇలాంటి విపరీతమైన భద్రతా చర్యలు తీసుకుంటున్నది ఒక్క కిమ్ మాత్రమే కాదు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ కూడా విదేశీ పర్యటనలకు వెళ్లినప్పుడు ఆయన మూత్ర, మల నమూనాలను ఆయన బాడీగార్డులు ప్రత్యేక సీల్డ్ కంటైనర్లలో సేకరిస్తారని సమాచారం. ఆ తర్వాత వాటిని సురక్షితంగా మాస్కోకు తరలిస్తారట. తన ఆరోగ్య రహస్యాలు బయటకు పొక్కకుండా ఉండేందుకే పుతిన్ ఈ జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు చెబుతారు.


More Telugu News