న్యూయార్క్‌లో ఐదుగురిని బలిగొన్న బస్సు ప్రమాదం.. బాధితుల్లో భారతీయులు

  • అమెరికాలోని న్యూయార్క్‌లో అదుపుతప్పిన టూర్ బస్సు
  • ఘోర ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికుల మృతి
  • డజన్ల కొద్దీ మందికి తీవ్ర గాయాలు, ఆసుపత్రికి తరలింపు
  • బాధితుల్లో భారత్, చైనా, ఫిలిప్పీన్స్ దేశీయులు
  • నయాగరా జలపాతం చూసి తిరిగొస్తుండగా దుర్ఘటన
అమెరికాలోని న్యూయార్క్ రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ఓ టూర్ బస్సు అదుపుతప్పి బోల్తా పడిన ఘటనలో ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందగా, డజన్ల కొద్దీ ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. బాధితుల్లో భారతీయులు కూడా ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు.

వివరాల్లోకి వెళితే.. 50 మందికి పైగా ప్రయాణికులతో ఓ టూర్ బస్సు నయాగరా జలపాతం పర్యటన ముగించుకుని న్యూయార్క్ నగరానికి తిరిగి వస్తోంది. ఈ క్రమంలో శుక్రవారం మధ్యాహ్నం 12:30 గంటల (అక్క‌డి స్థానిక కాల‌మానం ప్ర‌కారం) సమయంలో బఫెలో, రోచెస్టర్ నగరాల మధ్య ఇంటర్‌స్టేట్ 90 రహదారిపై బస్సు అదుపుతప్పింది. వేగంగా వెళ్తున్న బస్సు ఒక్కసారిగా రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్‌లోకి దూసుకెళ్లి, ఆపై పక్కకు బోల్తా పడింది. ఈ ప్రమాద తీవ్రతకు బస్సు నుజ్జునుజ్జు కాగా, కొందరు ప్రయాణికులు వాహనం నుంచి బయటకు ఎగిరిపడ్డారు.

సమాచారం అందుకున్న వెంటనే సహాయక బృందాలు ఘటనా స్థలానికి చేరుకుని, బస్సులో చిక్కుకున్న వారిని బయటకు తీశాయి. గాయపడిన వారిని సమీపంలోని ఆసుపత్రులకు తరలించాయి. బాధితుల్లో అమెరికాతో పాటు భారత్, చైనా, ఫిలిప్పీన్స్, మధ్యప్రాచ్య దేశాలకు చెందిన వారు ఉన్నారని న్యూయార్క్ స్టేట్ పోలీస్ మేజర్ ఆండ్రీ రే తెలిపారు. వేర్వేరు భాషల వారికి సహాయం చేసేందుకు ప్రత్యేకంగా అనువాదకులను ఘటనా స్థలానికి రప్పించారు.

ప్రమాదానికి డ్రైవర్ పరధ్యానమే కారణమని పోలీసులు  ప్రాథమికంగా నిర్ధారించారు. "డ్రైవర్ వాహనంపై నియంత్రణ కోల్పోయి, దాన్ని సరిదిద్దే ప్రయత్నంలో బస్సు బోల్తా పడిందని భావిస్తున్నాం" అని పోలీస్ అధికారులు వెల్లడించారు. ఈ ప్రమాదంలో స్వల్ప గాయాలతో బయటపడిన డ్రైవర్‌ను పోలీసులు విచారిస్తున్నారు. మృతుల వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News