గీత కార్మికులకు ఏపీ సర్కార్ మరో గుడ్ న్యూస్

  • త్వరలో ఆదరణ 3.0 పథకం 
  • గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు అందిస్తామన్న మంత్రి సవిత
  • విజయవాడలో సర్దార్ గౌత లచ్చన్న 116వ జయంతి సభలో నివాళులర్పించిన మంత్రులు, నేతలు
గీత కార్మికులకు ఏపీ సర్కార్ మరో శుభవార్త తెలిపింది. రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఇదివరకే గీత కార్మికులకు మద్యం దుకాణాలు, బార్‌ల కేటాయింపులో రిజర్వేషన్ కల్పించిన విషయం విదితమే. తాజాగా గీత కార్మికులకు ఆదరణ – 3 పథకం ద్వారా ద్విచక్ర వాహనాలు అందిస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఈ విషయాన్ని మంత్రి ఎస్. సవిత వెల్లడించారు.

సమాజ సేవకు మార్గదర్శిగా నిలిచిన బీసీ నేత సర్దార్‌ గౌతు లచ్చన్న 116వ జయంతిని విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిన్న ప్రభుత్వం అధికారికంగా ఘనంగా నిర్వహించింది. ఈ సందర్భంగా పలువురు మంత్రులు, ప్రజాప్రతినిధులు, తెలుగుదేశం పార్టీ నేతలు ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి గౌరవ నివాళులు అర్పించారు.

బీసీ సంక్షేమానికి ‘ఆదరణ 3.0’

ఈ సందర్భంగా బీసీ, చేనేత, జౌళి సంక్షేమ శాఖ మంత్రి ఎస్‌. సవిత మాట్లాడుతూ.. “గౌతు లచ్చన్న స్ఫూర్తితో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పాలన సాగిస్తున్నారు. త్వరలో ‘ఆదరణ 3.0’ పథకం ప్రారంభించనున్నాం. ఈ పథకం ద్వారా గీత కార్మికులకు ద్విచక్ర వాహనాలు అందజేస్తాం,” అని తెలిపారు. అంతే కాకుండా, “తాటి చెట్లు ఎక్కే కార్మికులకు ఆధునిక పరికరాలు, తాటి ఉత్పత్తుల ద్వారా ఉపాధి కల్పన కోసం రంపచోడవరం ఉద్యాన పరిశోధన కేంద్రంలో చర్యలు తీసుకుంటాం,” అని చెప్పారు.

గౌతు లచ్చన్న జీవితం స్ఫూర్తిదాయకం – అచ్చెన్నాయుడు

మంత్రి అచ్చెన్నాయుడు మాట్లాడుతూ .. “పల్లెటూరిలో పేద కుటుంబంలో పుట్టిన గౌతు లచ్చన్న గారు 95 ఏళ్ల వయసులోనూ రాజకీయాల్లో చురుకుగా పాల్గొన్నారు. ఆయన్నుంచి నాయకులు ప్రేరణ పొందాలి,” అని పేర్కొన్నారు.

బీసీల గౌరవానికి తెదేపా పాలన

ఎక్సైజ్‌ మంత్రి కొల్లు రవీంద్ర, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్ మాట్లాడుతూ.. “బీసీ వర్గాలకు చెందిన నేతలను గౌరవించడంలో తెదేపా ప్రభుత్వమే ముందుంటుంది,” అని అన్నారు. కార్యక్రమంలో తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు, ప్రభుత్వ విప్‌ బొండా ఉమా, విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్, మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, కేఈ ప్రభాకర్, ఎమ్మెల్యేలు కాగిత కృష్ణప్రసాద్, గౌతు శిరీష, ఆర్టీసీ ఛైర్మన్ కొనకళ్ల నారాయణరావు తదితరులు పాల్గొన్నారు. 


More Telugu News