వీరయ్య చౌదరి హత్య కేసు.. నిందితుడి ముందస్తు బెయిల్ కు సుప్రీం తిరస్కరణ

––
ఒంగోలు తెలుగుదేశం పార్టీ నేత వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సురేశ్ బాబుకు సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. ముందస్తు బెయిల్ కోసం ఆయన పెట్టుకున్న పిటిషన్ ను కోర్టు తోసిపుచ్చింది. సురేశ్ బాబు దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్‌ రాజేశ్‌ బిందాల్‌, జస్టిస్‌ మన్మోహన్‌ ల ధర్మాసనం ఈ రోజు ఉదయం విచారించింది. వీరయ్య చౌదరి హత్య కేసులో ఇప్పటికే 9 మందిని అరెస్టు చేశామని, ప్రధాన నిందితుడు సురేశ్‌ బాబు పరారీలో ఉన్నాడని పోలీసులు వెల్లడించారు.

ఈ కేసులో సురేశ్ బాబు ప్రమేయానికి సంబంధించి స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని ధర్మాసనం పేర్కొంది. డబ్బులు చేతులు మారడం, ఫోన్ కాల్స్‌ వంటి కీలకమైన ఆధారాలు ఉన్న నేపథ్యంలో ముందస్తు బెయిల్‌ కు సురేశ్ బాబుకు అర్హతలేదని ధర్మాసనం వ్యాఖ్యానించింది. అయితే, ఈ కేసులో మిగతా నిందితులకు రెగ్యులర్ బెయిల్ మంజూరైన విషయాన్ని సురేశ్ బాబు తరఫు న్యాయవాది ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ ముందస్తు బెయిల్ విషయంలోనూ కింది కోర్టునే ఆశ్రయించాలని సుప్రీం ధర్మాసనం సూచించింది.


More Telugu News