రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ అలా నటిస్తే బాగుండదు కదా: నాగార్జున

  • 'కూలీ' సినిమాలో సైమన్ పాత్ర నిజంగా హీరోలాంటిదన్న నాగార్జున
  • ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక పాత్రలు చేయాలని వ్యాఖ్య
  • ప్రయోగాలు చేసి విజయాలు సాధించా.. దెబ్బలు కూడా తిన్నానన్న నాగార్జున
"రజనీ సార్ చెప్పినట్లు ఎప్పుడూ మంచివాళ్లుగానే సినిమాలో నటిస్తే బాగుండదు కదా. 'కూలీ' సినిమాలో సైమన్ పాత్ర నిజంగా హీరోలాంటిది" అని ప్రముఖ సినీ నటుడు నాగార్జున అన్నారు. రజనీకాంత్ కథానాయకుడిగా లోకేశ్ కనగరాజన్ దర్శకత్వంలో 'కూలీ' చిత్రం రూపొందుతోంది.

ఈ సినిమా ఆగస్టు 14న విడుదల కానుంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో జరిగిన ప్రీ-రిలీజ్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ, సినిమా సెట్స్ మీదకు వెళ్లాక బోర్ కొట్టకుండా ఉండాలంటే ఎప్పటికప్పుడు ప్రయోగాత్మక పాత్రలు చేయాలని అన్నారు.

'నిన్నే పెళ్లాడతా' సినిమా తర్వాత 'అన్నమయ్య' చేస్తుంటే ఇలాంటి కథతో ఇప్పుడు అవసరమా అని కొంతమంది సూచన చేశారని తెలిపారు. తన కెరీర్‌లో ఎన్నో ప్రయోగాలు చేశానని, అలా చేయడం ద్వారా చాలా దెబ్బలు తిన్నానని, అలాగే విజయాలు కూడా సాధించానని అన్నారు.

ఒకరోజు లోకేశ్ కనగరాజన్ తనను కలిసి 'మీరు విలన్‌గా చేస్తానంటే మీకు ఒక కథ చెబుతాను. లేదంటే టీ తాగేసి వెళ్లిపోతాను' అని అన్నారని గుర్తు చేసుకున్నారు. 'ఖైదీ' సినిమా చూశాక ఈ దర్శకుడితో పని చేయాలనుకున్నానని, ఆ బలమైన కోరిక దగ్గర చేసిందని వ్యాఖ్యానించారు.

'కూలీ' కథ చెప్పిన తర్వాత తనకు చాలా ఆసక్తిగా అనిపించిందని, ఇందులో సైమన్ పాత్ర హీరోలాంటిదని పేర్కొన్నారు. ఇలాంటి ధీటైన పాత్ర ఉంటే రజనీ సర్ ఒప్పుకున్నారా అని కూడా దర్శకుడిని అడిగినట్లు చెప్పారు. లోకేశ్ తనకు కథ చెబుతుంటే రికార్డు చేసుకున్నానని, కొన్ని మార్పులు చేస్తే అందుకు అనుగుణంగా సైమన్ పాత్రను డెవలప్ చేశారని తెలిపారు. లోకేశ్ కనగరాజ్ సెట్‌లో చాలా ప్రశాంతంగా ఉంటారని నాగార్జున వెల్లడించారు.


More Telugu News