సింధూ జలాల ఒప్పందం... కీలక ప్రకటన చేసిన జై శంకర్

  • సింధూ జలాల ఒప్పందం అమలు నిలిపివేత కొనసాగుతోందని వెల్లడి
  • నీరు, రక్తం కలిసి ప్రవహించవని పునరుద్ఘాటన
  • నెహ్రూ హయాంలో జరిగిన తప్పిదాలను మార్చవచ్చని మోదీ నిరూపించారని వ్యాఖ్య
పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో సింధూ జలాల ఒప్పందం అమలు నిలిపివేత కొనసాగుతోందని విదేశాంగ శాఖ మంత్రి జై శంకర్ స్పష్టం చేశారు. నీరు, రక్తం కలిసి ప్రవహించలేవని ఆయన పునరుద్ఘాటించారు. బుధవారం నాడు రాజ్యసభలో ఆయన మాట్లాడుతూ, పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని విడనాడే వరకు ఈ నిలిపివేత కొనసాగుతుందని తేల్చి చెప్పారు.

సింధూ జలాల ఒప్పందం కుదుర్చుకున్న సమయంలో అధికారంలో ఉన్న పాలకులు భారత రైతుల ప్రయోజనాల కంటే పాకిస్థాన్ ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చారని ఆయన విమర్శించారు. నెహ్రూ హయాంలోని తప్పిదాలను సరిదిద్దలేమని గతంలో 60 ఏళ్లు పాలించిన వారు చెబుతూ వచ్చారని, అయితే మోదీ ప్రభుత్వం వాటిని మార్చవచ్చని నిరూపించిందని అన్నారు.

ఆర్టికల్ 370 రద్దు, సింధూ జలాల ఒప్పందంపై తీసుకున్న చర్యలు ఇందుకు నిదర్శనమని ఆయన పేర్కొన్నారు. సింధూ జలాల ఒప్పందానికి అవసరమైన మార్పులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు. పహల్గామ్ ఉగ్రదాడికి పాల్పడిన ది రెసిస్టెన్స్ ఫ్రంట్‌ను ఐక్యరాజ్యసమితి తొలిసారి తన నివేదికలో ప్రస్తావించిందని ఆయన గుర్తు చేశారు.


More Telugu News