అమర్‌నాథ్ యాత్ర.. 21 రోజుల్లో 3.52 లక్షలకు పైగా మంది ద‌ర్శ‌నం

  • జులై 3న ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్ర
  • గత 21 రోజుల్లో యాత్రలో పాల్గొన్న 3.52 లక్షలకు పైగా భక్తులు 
  • ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ సందర్భంగా ముగియ‌నున్న అమర్‌నాథ్ యాత్ర
జులై 3న ప్రారంభమైనప్పటి నుంచి గత 21 రోజుల్లో అమర్‌నాథ్ యాత్ర చేస్తున్న యాత్రికుల సంఖ్య 3.50 లక్షలను దాటిందని అధికారులు తెలిపారు. ఇప్పటివరకు 3.52 లక్షలకు పైగా భక్తులు అమర్‌నాథ్ యాత్రలో పాల్గొన్నారని వెల్ల‌డించారు.

జమ్మూలోని భగవతి నగర్ యాత్రి నివాస్ నుంచి రెండు బేస్ క్యాంపులకు రెండు ఎస్కార్ట్ కాన్వాయ్‌లలో 2,896 మంది యాత్రికుల బృందం శుక్రవారం బయలుదేరింద‌ని తెలిపారు. 790 మంది యాత్రికులతో 42 వాహనాలతో కూడిన మొదటి ఎస్కార్ట్ కాన్వాయ్ తెల్లవారుజామున 3:30 గంటలకు బాల్టాల్ బేస్ క్యాంపుకు బయలుదేరింది. 

అలాగే 2,106 మంది యాత్రికులతో 75 వాహనాలతో కూడిన రెండవ కాన్వాయ్ తెల్లవారుజామున 4:18 గంటలకు పహల్గామ్ బేస్ క్యాంపుకు బయలుదేరింద‌ని అధికారులు తెలిపారు.

ఇక‌, గురువారం శ్రీనగర్‌లోని చారిత్రాత్మక శంకరాచార్య ఆలయానికి మహంత్ దీపేంద్ర గిరి నేతృత్వంలోని సాధువుల బృందం 'చారీ ముబారక్' (శివుని పవిత్ర గద)ను ఆచార పూజల కోసం తీసుకెళ్లింది. కాగా, శంకరాచార్య ఆలయంలో పూజను ప్రతి సంవత్సరం 'హర్యాలి-అమావాస్య' (శ్రావణ అమావాస్య) సందర్భంగా పురాతన ఆచారాల ప్రకారం నిర్వహిస్తారు.

ఈ రోజు చారీ ముబారక్‌ను శ్రీనగర్‌లోని హరి పర్వత్ కొండపై ఉన్న 'శారికా భవానీ' ఆలయానికి తీసుకెళ్లి ఆచార పూజలు చేస్తారు. ఇక‌, ఆగస్టు 4న శ్రీనగర్‌లోని దశనామి అఖారా ఆలయం నుంచి గుహ మందిరం వైపు తన చివరి ప్రయాణాన్ని ప్రారంభించి ఆగస్టు 9న పవిత్ర గుహ మందిరానికి చేరుకుంటారు. ఇది యాత్ర అధికారిక ముగింపును సూచిస్తుంది.

ఈ సంవత్సరం అమర్‌నాథ్ యాత్రకు అధికారులు విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఎందుకంటే ఏప్రిల్ 22న పహల్గామ్‌లోని బైసరన్ గడ్డి మైదానంలో జ‌రిగిన ఉగ్రదాడిలో 26 మంది ప‌ర్యాట‌కుల‌ను ముష్క‌రులు పొట్ట‌నబెట్టుకున్నారు. ఈ ఉగ్ర‌దాడి త‌ర్వాత జ‌రుగుతున్న యాత్ర కావ‌డంతో ఈసారి అధికారులు భారీ బందోబ‌స్తు ఏర్పాటు చేశారు.

ఇందులో భాగంగా బీఎస్ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఎస్ఎస్‌బీ, స్థానిక పోలీసుల‌కు అదనంగా 180 కంపెనీల కేంద్ర సాయుధ పోలీసు దళాలను రప్పించారు. ఈ ఏడాది యాత్రికుల సుర‌క్షిత ప్ర‌యాణం కోసం సైన్యం ఏకంగా 8,000 మందికి పైగా ప్రత్యేక కమాండోలను మోహరించింది. యాత్ర జులై 3న ప్రారంభమై 38 రోజుల తర్వాత ఆగస్టు 9న శ్రావణ పూర్ణిమ మరియు రక్షా బంధన్ సందర్భంగా ముగుస్తుంది.


More Telugu News