పెళ్లి పేరుతో మోసం చేశాడని యువతి ఫిర్యాదు.. ఆర్సీబీ బౌలర్ యశ్‌ దయాల్‌పై కేసు న‌మోదు

  • ఆర్సీబీ ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్‌పై లైంగిక వేధింపుల‌ కేసు
  • పెళ్లి పేరుతో మోసం చేశాడని ఘజియాబాద్ యువతి ఫిర్యాదు
  • ఐదేళ్లుగా రిలేష‌న్‌షిప్‌లో ఉన్నామని బాధితురాలి ఆరోపణ
  • భారతీయ న్యాయ సంహిత సెక్షన్ 69 కింద ఎఫ్ఐఆర్
  • మానసికంగా, శారీరకంగా హింసించాడని యువతి ఆవేదన
ఐపీఎల్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) జట్టుకు ప్రాతినిధ్యం వహిస్తున్న ఫాస్ట్ బౌలర్ యశ్ దయాల్‌పై లైంగిక వేధింపుల‌ ఆరోపణలతో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి తనను మోసం చేశాడంటూ ఓ యువతి చేసిన ఫిర్యాదు మేరకు పోలీసులు సోమవారం ఎఫ్ఐఆర్ నమోదు చేశారు.

ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌కు చెందిన బాధితురాలు, తాను యశ్ దయాల్‌తో గత ఐదేళ్లుగా రిలేష‌న్‌షిప్‌లో ఉన్నానని తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ క్రమంలో యశ్ దయాల్ తనను పెళ్లి చేసుకుంటానని పదేపదే నమ్మించి శారీరక సంబంధం పెట్టుకున్నాడని ఆమె ఆరోపించారు. తనను అతని కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశాడని, వారంతా తననే కోడలిగా చేసుకుంటామని హామీ ఇచ్చారని తెలిపారు.

జూన్ 21న ముఖ్యమంత్రి ఆన్‌లైన్ గ్రీవెన్స్ పోర్టల్ ద్వారా బాధితురాలు మొదట ఫిర్యాదు చేశారు. దీనిపై ప్రాథమిక విచారణ జరిపిన ఇందిరాపురం పోలీసులు, భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 69 కింద యశ్ దయాల్‌పై కేసు నమోదు చేశారు. ఈ సెక్షన్ ప్రకారం నేరం రుజువైతే పదేళ్ల వరకు జైలు శిక్ష, జరిమానా విధించే అవకాశం ఉంది.

యశ్ దయాల్ ప్రవర్తన వల్ల తాను తీవ్రమైన డిప్రెషన్‌లోకి వెళ్లానని, మానసిక వేదన తట్టుకోలేక చాలాసార్లు ఆత్మహత్యాయత్నం కూడా చేశానని బాధితురాలు తన ఫిర్యాదులో ఆవేదన వ్యక్తం చేశారు. యశ్‌కు ఇతర యువతులతో కూడా సంబంధాలున్నాయని, ఇది తనను మానసికంగా కుంగదీసిందని ఆమె ఆరోపించారు. అయితే, ఈ ఆరోపణలపై స్పందించిన యశ్ దయాల్ తండ్రి, ఆ యువతి ఎవరో తమకు తెలియదని చెప్పినట్లు సమాచారం. ఈ కేసులో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.


More Telugu News