బెదిరింపు ఎఫెక్ట్... బీజేపీ ఎంపీ రఘునందన్‌రావుకు భద్రత పెంపు

  • మెదక్ ఎంపీ రఘునందన్‌రావుకు భద్రత పెంపు
  • మావోయిస్టుల నుంచి బెదిరింపు కాల్ రావడమే కారణం
  • పోలీసు శాఖ విచారణ జరిపి భద్రత అవసరమని నిర్ధారణ
  • ఇకపై రఘునందన్ పర్యటనలో పోలీసు ఎస్కార్ట్
  • మెదక్ పార్లమెంట్ పరిధిలోని ముగ్గురు ఎస్పీలకు ఆదేశాలు
మెదక్ ఎంపీ, బీజేపీ నేత రఘునందన్‌రావుకు భద్రత పెంచాలని తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ నిర్ణయించింది. ఇటీవల ఆయనకు మావోయిస్టుల పేరుతో బెదిరింపు కాల్ వచ్చిన విషయం విదితమే. ఈ ఘటనపై క్షుణ్ణంగా దర్యాప్తు చేసిన పోలీసు శాఖ, రఘునందన్‌రావుకు అదనపు భద్రత కల్పించాల్సిన అవసరం ఉందని నిర్ధారించింది.

ఈ నేపథ్యంలో, రఘునందన్‌రావు పర్యటనల సమయంలో పోలీసు ఎస్కార్ట్‌ను ఏర్పాటు చేయాలని పోలీసు శాఖ నిర్ణయించింది. ఈ మేరకు మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని ముగ్గురు పోలీసు సూపరింటెండెంట్లకు (ఎస్పీలకు) ఉన్నతాధికారుల నుంచి స్పష్టమైన ఆదేశాలు జారీ అయ్యాయి.

పీపుల్స్ వార్ మావోయిస్టునంటూ గుర్తు తెలియని వ్యక్తి రఘునందన్‌రావుకు ఫోన్ చేసి బెదిరించాడు. సోమవారం సాయంత్రంలోగా హతమారుస్తామంటూ ఆగంతకుడు హెచ్చరించాడు. తాను మధ్యప్రదేశ్‌కు చెందిన మావోయిస్టునని ఆ వ్యక్తి పేర్కొన్నాడు. మేడ్చల్ జిల్లా దమ్మాయిగూడలోని ఒక ప్రైవేటు పాఠశాలలో జరిగిన కార్యక్రమానికి ఎంపీ రఘునందన్‌రావు హాజరైన సమయంలో ఈ బెదిరింపు కాల్ వచ్చింది. ఆ సమయంలో రఘునందన్‌రావు పీఏ ఫోన్‌ మాట్లాడారు. బెదిరింపు నేపథ్యంలో రఘునందన్ రావు డీజీపీ, మెదక్ జిల్లా ఎస్పీ, ఇతర పోలీసు అధికారులకు ఫిర్యాదు చేశారు.


More Telugu News