మణిరత్నంను ఇంప్రెస్ చేయాలంటే అవి ఇస్తే చాలు: సుహాసిని

  • మణిరత్నంకు మిల్కీ వైట్ పేపర్స్ అంటే అమితమైన ఇష్టమని సుహాసిని వెల్లడి
  •  ఆ కాగితాలు బహుకరిస్తే ఆయన ఫిదా అవుతారని వివరణ
  • గతంలో అవి బహుమతిగా ఇచ్చి ఇంప్రెస్ చేశానని వ్యాఖ్యలు
  • ఆ కాగితాలను బంగారంలా, పసిపిల్లల్లా చూసుకుంటారన్న సుహాసిని
  • స్క్రిప్ట్ తాకే ముందు చేతులు శుభ్రంగా కడుక్కుంటారని వెల్లడి
ప్రముఖ దర్శకుడు మణిరత్నం నేడు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. ఈ సందర్భంగా, ఆయన అర్ధాంగి సుహాసిని గతంలో చెప్పిన ఓ విషయం తెరపైకి వచ్చింది. మణిరత్నంకు అమితంగా ఇష్టమైన ఒక వస్తువు ఉందని, దాన్ని బహుకరిస్తే ఎవరైనా ఆయన్ను సులభంగా ఇంప్రెస్ చేయవచ్చని ఓ సందర్భంలో ఆమె నవ్వుతూ చెప్పారు. అంతేకాదు, తాను కూడా నాలుగైదు సార్లు అదే బహుమతి ఇచ్చి ఆయన్ను ఇంప్రెస్ చేశానని ఆమె తెలిపారు. ఇంతకీ మణిరత్నం మనసును అంతగా దోచిన ఆ వస్తువు ఏంటో కాదు, స్వచ్ఛమైన తెల్ల కాగితాలు (మిల్కీ వైట్ పేపర్స్).

మణిరత్నంకు పాల తెలుపు రంగులో ఉండే కాగితాలంటే వల్లమాలిన ప్రేమ. తన స్క్రిప్ట్ పనులు ప్రారంభించే ముందు, అత్యుత్తమ నాణ్యత కలిగిన తెల్ల కాగితాలను ఆయన ప్రత్యేకంగా కొనుగోలు చేస్తారట. దీన్నిబట్టి ఆయన కాగితాల తెలుపుదనం విషయంలో ఎంత పట్టింపుగా ఉంటారో అర్థం చేసుకోవచ్చు. ఆ తెల్లని కాగితాలపై పెన్సిల్‌తోనే ఆయన తన ఆలోచనలను అక్షర రూపంలోకి తెస్తారని సుహాసిని వివరించారు.

"ఎందుకండీ అంత పర్టిక్యులర్‌గా ఉంటారు?" అని తాను అప్పుడప్పుడూ అడిగితే, ఆయన చిన్న చిరునవ్వుతో సమాధానం దాటవేస్తారని సుహాసిని గుర్తుచేసుకున్నారు. తన స్క్రిప్టును తాకే ముందు ప్రతిసారీ చేతులు శుభ్రంగా కడుక్కుని మరీ వాటిని ముట్టుకుంటారని, ఆ కాగితాలను బంగారంలాగా, అప్పుడే పుట్టిన పసికందులాగా ఎంతో జాగ్రత్తగా చూసుకుంటారని ఆమె తెలిపారు. వాటిపై ఇసుమంతైనా దుమ్ము పడటాన్ని ఆయన అస్సలు సహించరని సుహాసిని ఆనాటి సంభాషణలో పేర్కొన్నారు. ఈ విషయాలు మణిరత్నం సృజనాత్మక ప్రక్రియ వెనుక ఉన్న శ్రద్ధను, ఆయన వ్యక్తిత్వంలోని ఓ ఆసక్తికర కోణాన్ని తెలియజేస్తున్నాయి.


More Telugu News