'ఓజీ' షూటింగ్‌కు మ‌రోసారి ఆటంకం.. ఈసారి విల‌న్ వ‌ల్ల బ్రేక్‌!

Pawan Kalyan OG Shooting Interrupted Due to Villain Health Issues
పవర్ స్టార్ పవన్ కల్యాణ్ ప్ర‌స్తుతం జెట్ స్పీడ్‌తో తాను ఒప్పుకున్న సినిమాలను పూర్తి చేసే ప‌నిలో ఉన్నారు. ఇందులో భాగంగానే ఒక్కో సినిమాను పూర్తి చేస్తున్నారు. ఇప్ప‌టికే 'హరిహర వీరమల్లు' షూటింగ్‌ను పూర్తి చేసిన ఆయ‌న‌... ఇప్పుడు మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ ‘ఓజీ’ షూటింగ్‌లో పాల్గొంటున్నాడు. ప్ర‌స్తుతం ఈ మూవీ ముంబ‌యిలో షూటింగ్ జరుపుకుంటోంది. ఇటీవ‌ల‌ షూట్ నుంచి పవన్ ఫొటోలు, వీడియోలు కూడా లీక్ అయ్యాయి.  

అయితే, పవన్ రాజకీయాల్లో బిజీ కావ‌డంతో ఆగిన 'ఓజీ' సినిమా ఎట్టకేలకు పూర్తవుతుంద‌ని అభిమానులు సంతోషించేలోపే ఓ న‌టుడి వ‌ల్ల ఈ సినిమా షూటింగ్‌కి మ‌ళ్లీ బ్రేక్ ప‌డింది. ముంబ‌యిలోని గోరేగావ్ ప్రాంతంలోని ఆరే కాలనీలో ఓజీ కొత్త షెడ్యూల్‌ను రీసెంట్‌గా చిత్రం యూనిట్‌ మొదలు పెట్టింది. ఇందులో భాగంగా హీరో ప‌వ‌న్, విల‌న్‌ ఇమ్రాన్ హ‌ష్మీల మ‌ధ్య కీల‌క స‌న్నివేశాలు చిత్రీక‌రిస్తున్నారు. 

ఈ క్ర‌మంలో షూట్‌కి వ‌చ్చిన ఇమ్రాన్ హష్మీ అనారోగ్యం బారిన పడ్డారు. వైద్య ప‌రీక్ష‌లు చేయించుకోగా ఆయ‌న‌కి డెంగ్యూ అని తేలింది. దాంతో వైద్యులు వారం పాటు విశ్రాంతి తీసుకోవాల‌ని సూచించారు. ఈ విష‌యాన్ని ఇమ్రాన్... ద‌ర్శ‌కుడు సుజీత్, నిర్మాత‌ డీవీవీ దాన‌య్య‌లకి తెలియ‌జేశారు. వారు ప‌వ‌న్ దృష్టికి ఈ విష‌యం తీసుకెళ్లారు. దాంతో మంచి మ‌న‌సుతో అర్ధం చేసుకున్న ప‌వ‌ర్‌స్టార్‌... ఇమ్రాన్ కోలుకున్న త‌ర్వాతే షూటింగ్ చేద్దామ‌ని చెప్పిన‌ట్లు స‌మాచారం.

కాగా, యువ ద‌ర్శ‌కుడు సుజిత్ తెర‌కెక్కిస్తున్న 'ఓజీ'లో ప‌వ‌న్ స‌ర‌స‌న హీరోయిన్‌గా ప్రియాంక మోహ‌న్ న‌టిస్తున్న విష‌యం తెలిసిందే. డీవీవీ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్ బ్యాన‌ర్‌పై దాన‌య్య నిర్మిస్తున్న ఈ చిత్రానికి త‌మ‌న్ సంగీతం అందిస్తున్నారు. ఈ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్‌ను ద‌స‌రా కానుక‌గా సెప్టెంబ‌ర్ 25న విడుద‌ల చేయ‌నున్న‌ట్లు ఇటీవ‌లే మేక‌ర్స్ ప్ర‌క‌టించారు. 

ఇందులో పవన్ ప‌వ‌ర్‌ ఫుల్ గ్యాంగ్ స్టర్ పాత్రలో కనిపిస్తుండటంతో అభిమానులు ఈ సినిమా ఎప్పుడెప్పుడు వ‌స్తుందా అని వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. ఇక ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, వీడియో సాంగ్‌కు అద్భుతమైన రెస్పాన్స్ వచ్చిన విష‌యం తెలిసిందే. దీంతో 'ఓజీ'పై భారీ అంచనాలు నెల‌కొన్నాయి.  
Go Back to Shorts
OG
Pawan Kalyan
OG Movie
Imran Hashmi
Sujith
Priyanka Mohan
DVV Danayya
Telugu cinema
action thriller
dengue fever
Mumbai

More Telugu News