దక్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు యూట‌ర్న్‌... ఐపీఎల్‌కి అందుబాటులోనే సౌతాఫ్రికా ఆట‌గాళ్లు

  • డ‌బ్ల్యూటీసీ ఫైన‌ల్ నేప‌థ్యంలో త‌మ ఆట‌గాళ్ల‌కు ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు కీల‌క ఆదేశాలు
  • మే 26 నాటికి ఐపీఎల్‌ ఆడుతున్న‌ ఆటగాళ్లందరూ స్వదేశానికి తిరిగి వ‌చ్చేయాల‌న్న‌ ద‌క్షిణాఫ్రికా
  • తాజాగా ఈ నిర్ణ‌యంపై క్రికెట్ ద‌క్షిణాఫ్రికా యూట‌ర్న్
  • జూన్ 3న‌ ఐపీఎల్ ఫైన‌ల్ ముగిసిన‌ త‌ర్వాత డ‌బ్ల్యూటీసీ సన్నాహాలు మొద‌లు పెడ‌తామ‌ని వెల్ల‌డి
జూన్‌లో ఆస్ట్రేలియాతో వ‌ర‌ల్డ్ టెస్ట్ ఛాంపియ‌న్‌షిప్ (డ‌బ్ల్యూటీసీ) ఫైన‌ల్ ఆడ‌నున్న నేప‌థ్యంలో త‌మ ఆట‌గాళ్లు ఐపీఎల్ ప్లేఆఫ్స్ మ్యాచుల‌కు అందుబాటులో ఉండ‌ర‌ని ఇటీవ‌ల ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. మే 26 నాటికి ఐపీఎల్‌లో ఆడుతున్న‌ ఆటగాళ్లందరూ స్వదేశానికి తిరిగి వ‌చ్చేయాల‌ని ద‌క్షిణాఫ్రికా అధికారులు ఆదేశించారు. అయితే, తాజాగా ఈ నిర్ణ‌యంపై క్రికెట్ ద‌క్షిణాఫ్రికా (సీఎస్ఏ) యూట‌ర్న్ తీసుకుంది. 

జూన్ 3వ తేదీన జ‌రిగే ఐపీఎల్ ఫైన‌ల్ ముగిసిన‌ త‌ర్వాత డ‌బ్ల్యూటీసీ సన్నాహాలు మొద‌లు పెడ‌తామ‌ని సీఎస్ఏ తెలిపింది. ఈ మేర‌కు క్రికెట్ సౌతాఫ్రికా డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఎనోచ్ న్క్వే వెల్ల‌డించార‌ని 'సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్' త‌న క‌థ‌నంలో పేర్కొంది. దీంతో క‌సిగో ర‌బాడ‌, ఐదెన్‌ మార్క్ర‌మ్‌, మార్కో య‌న్సెన్, డేవిడ్ మిల్ల‌ర్‌, హెన్రిచ్ క్లాసెన్‌, రికెల్ట‌న్, ట్రిస్టన్ స్టబ్స్ త‌దిత‌ర ప్లేయ‌ర్లు లీగ్ ముగిసేవ‌ర‌కు త‌మత‌మ ఐపీఎల్ ఫ్రాంచైజీల‌కు అందుబాటులో ఉండ‌నున్నారు. 

ఇక‌, ద‌క్షిణాఫ్రికా క్రికెట్ బోర్డు తాజా ప్ర‌క‌ట‌నతో ఐపీఎల్‌ ఫ్రాంచైజీలకు భారీ ప్రోత్సాహం లభించిన‌ట్లైంది. కాగా, భారత్‌, పాకిస్థాన్ మధ్య సరిహద్దు ఉద్రిక్తతల కారణంగా వారం పాటు నిలిపివేయబడిన ఐపీఎల్ లీగ్ ఎల్లుండి (మే 17న) నుంచి  తిరిగి ప్రారంభమవుతున్న విష‌యం తెలిసిందే.

కాగా, ప్ర‌స్తుతం జ‌రుగుతున్న‌ ఐపీఎల్ 18వ సీజ‌న్‌లో వివిధ ఫ్రాంచైజీల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ద‌క్షిణాఫ్రికాకు చెందిన ఎనిమిది మంది ఆటగాళ్లు డ‌బ్ల్యూటీసీ ఫైనల్ కోసం సౌతాఫ్రికా జట్టులో చోటు దక్కించుకున్నారు. కగిసో రబాడ (గుజరాత్ టైటాన్స్), లుంగి ఎంగిడి (రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు), ట్రిస్టన్ స్టబ్స్ (ఢిల్లీ క్యాపిటల్స్), ఐదెన్ మార్క్రమ్ (లక్నో సూపర్ జెయింట్స్), ర్యాన్ రికెల్టన్ (ముంబ‌యి ఇండియన్స్), కార్బిన్ బాష్ (ముంబ‌యి ఇండియ‌న్స్‌), మార్కో య‌న్సెన్ (పంజాబ్ కింగ్స్), వియాన్ ముల్డర్ (సన్‌రైజర్స్ హైదరాబాద్)ల‌కు ద‌క్షిణాఫ్రికా జ‌ట్టులో చోటు ద‌క్కింది.  


More Telugu News