పాక్‌పై భారత్ ప్రతీకార దాడులు.. 4 వైమానిక స్థావరాలు, డ్రోన్ లాంచ్‌ప్యాడ్స్ ధ్వంసం!

  •  సరిహద్దుల్లో 26 చోట్ల పాక్ డ్రోన్లు, శతఘ్నులతో దాడి
  • ప్రతిగా పాక్‌లోని 4 కీలక వైమానిక స్థావరాలపై విరుచుకుపడిన భారత్
  •  దాడులను ధ్రువీకరించిన పాక్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరిఫ్.
  • రావల్పిండి, చక్వాల్, షోర్కోట్‌లలోని పాక్ ఎయిర్‌బేస్‌లలో పేలుళ్లు
  • నేటి ఉదయం 10 గంటలకు భారత సైన్యం ప్రెస్‌మీట్‌
భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. పాకిస్థాన్ సైన్యం శుక్రవారం రాత్రి భారత భూభాగంలోని పలు ప్రాంతాలపై డ్రోన్లు, శతఘ్నులతో దాడులకు పాల్పడగా, భారత బలగాలు దీటుగా స్పందించాయి. పాకిస్థాన్‌లోని నాలుగు కీలక వైమానిక స్థావరాలతోపాటు డ్రోన్ లాంచ్‌ప్యాడ్స్‌పై భారత్ ప్రతిదాడులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ దాడుల ఘటనను పాకిస్థాన్ సైనిక ఉన్నతాధికారి ఒకరు ధ్రువీకరించారు.

శుక్రవారం పగటిపూట కొంత ప్రశాంతంగా ఉన్న సరిహద్దు వాతావరణం చీకటి పడిన తర్వాత ఒక్కసారిగా వేడెక్కింది. పాకిస్థాన్ సైన్యం బారాముల్లా నుంచి భుజ్ వరకు సుమారు 26 ప్రదేశాలపై డ్రోన్లు, ఫిరంగులతో దాడులకు తెగబడింది. ముఖ్యంగా శ్రీనగర్ విమానాశ్రయం, అవంతీపురాలోని వైమానిక స్థావరాన్ని లక్ష్యంగా చేసుకుని పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత సైన్యం సమర్థవంతంగా కూల్చివేసింది.

పాకిస్థాన్ దుస్సాహసానికి ప్రతిగా భారత బలగాలు ఆ దేశంలోని మూడు ప్రధాన వైమానిక స్థావరాలపై విరుచుకుపడినట్లు సమాచారం. రావల్పిండి సమీపంలోని చక్లాలాలో ఉన్న నూర్‌ఖాన్‌ ఎయిర్‌బేస్‌, చక్వాల్‌లోని మురీద్‌ ఎయిర్‌బేస్‌, జాంగ్‌ జిల్లా షోర్కోట్‌లోని రఫీకి వైమానిక స్థావరాల్లో భారీ పేలుళ్లు సంభవించినట్లు తెలుస్తోంది. తమ వైమానిక స్థావరాలపై దాడులు జరిగిన విషయాన్ని పాకిస్థాన్ సైనిక ప్రతినిధి లెఫ్టినెంట్‌ జనరల్‌ అహ్మద్‌ షరిఫ్‌ చౌదురి ధ్రువీకరించారు. భారత్ దాడులకు సరైన రీతిలో ప్రతిస్పందిస్తామని పాక్ సైన్యం పేర్కొన్నట్లు సమాచారం. కాగా, పాకిస్థాన్ తమ దాడులకు ‘ఆపరేషన్‌ బున్యాన్‌ ఉన్‌ మర్సూస్‌’ (బలమైన పునాది) అని పేరు పెట్టింది.

అయితే, పాకిస్థాన్‌పై జరిగిన ఈ ప్రతిదాడుల గురించి భారత వాయుసేన గానీ, సైన్యం గానీ ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి ప్రకటన విడుదల చేయలేదు. తాజా పరిణామాలపై నేటి (శనివారం) ఉదయం 10 గంటలకు భారత సైన్యం ప్రెస్ మీట్ నిర్వహించనున్నట్లు సమాచారం. శనివారం తెల్లవారుజాము నుంచి పాకిస్థాన్ తిరిగి దాడులు కొనసాగిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పరిణామాలతో ఇరు దేశాల సరిహద్దుల్లో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది.


More Telugu News