Elon Musk: ప్రపంచ తొలి ట్రిలియనీర్‌గా ఎలాన్ మస్క్!

Elon Musk to Become Worlds First Trillionaire
  • రికార్డుకు చేరువైన అపర కుబేరుడు
  • స్పేస్ ఎక్స్ అధినేత ప్రస్తుత ఆస్తులు 850 బిలియన్ డాలర్లు
  • ‘స్పేస్ ఎక్స్ – ఎక్స్ ఏఐ’ డీల్ కుదిరితే భారీగా పెరగనున్న మస్క్ సంపద
టెక్ దిగ్గజం, ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ సరికొత్త చరిత్ర సృష్టించేందుకు సిద్ధమవుతున్నారు. ప్రపంచంలోనే అత్యంత సంపన్న వ్యక్తిగా ఉన్న ఆయన, అతి త్వరలోనే 'తొలి ట్రిలియనీర్' హోదాను దక్కించుకోనున్నారని ఆర్థిక నిపుణులు అంచనా వేస్తున్నారు. ఈ ఏడాది ముగిసేలోపే మస్క్ ఈ మైలురాయిని చేరుకునే అవకాశం ఉంది.

సంపదలో అగ్రస్థానం..
ప్రస్తుతం మస్క్ నికర ఆస్తుల విలువ 850 బిలియన్ డాలర్లకు చేరింది. ఫిబ్రవరి నాటికి 800 బిలియన్ డాలర్ల మార్కును దాటిన తొలి వ్యక్తిగా ఆయన రికార్డు సృష్టించారు. మస్క్ సంపద ఏ స్థాయిలో ఉందంటే.. ప్రపంచంలోని మరో ముగ్గురు అగ్రశ్రేణి కుబేరుల మొత్తం సంపద కంటే ఇది ఎక్కువ. లారీ పేజ్ (గూగుల్): 251 బిలియన్ డాలర్లు, సెర్గీ బ్రిన్ (గూగుల్): 231 బిలియన్ డాలర్లు, మార్క్ జుకర్‌బర్గ్ (మెటా): 219 బిలియన్ డాలర్లు.. ఈ ముగ్గురి మొత్తం సంపద 701 బిలియన్ డాలర్లు కాగా మస్క్ ఒక్కరి సంపదే 850 బిలియన్ డాలర్లు కావడం విశేషం.

ట్రిలియన్ మార్కుకు చేర్చే ‘స్పేస్ ఎక్స్ – ఎక్స్ ఏఐ’ డీల్
మస్క్ సంపద ఇంత వేగంగా పెరగడానికి ఇటీవల జరిగిన ఒక భారీ ఒప్పందమే ప్రధాన కారణం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సంస్థ ఎక్స్ ఏఐని స్పేస్ ఎక్స్ 1.25 ట్రిలియన్ డాలర్లతో కొనుగోలు చేసింది. విలీనమైన ఈ కొత్త సంస్థలో మస్క్‌కు 43 శాతం వాటా ఉంది. దీని విలువ సుమారు 530 బిలియన్ డాలర్లు కావడం గమనార్హం.

మస్క్ ఆస్తుల విభజన
స్పేస్ ఎక్స్/ ఎక్స్ ఏఐ వాటా: 530 బిలియన్ డాలర్లు
టెస్లా వాటా(12%): 178 బిలియన్ డాలర్లు

త్వరలో 1.5 ట్రిలియన్ డాలర్లకు..
ఈ ఏడాది మస్క్ ట్రిలియనీర్‌గా మారే అవకాశం 75 శాతం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు పేర్కొంటున్నాయి. దీనికి అదనంగా త్వరలోనే స్పేస్ ఎక్స్ సంస్థ ఐపీఓ ద్వారా సుమారు 25 బిలియన్ డాలర్లను సమీకరించాలని భావిస్తోంది. ఈ ప్రక్రియ విజయవంతమైతే, మస్క్ నికర విలువ ఏకంగా 1.5 ట్రిలియన్ డాలర్లకు పెరిగే అవకాశం ఉంది.
Elon Musk
SpaceX
X AI
Tesla
trillionaire
wealth
net worth
artificial intelligence
IPO

More Telugu News