Ilayaraja: ఢిల్లీ హైకోర్టులో ఇళయరాజాకు ఎదురుదెబ్బ
- పాటల హక్కులపై ఢిల్లీ హైకోర్టు కీలక తీర్పు
- ఇళయరాజా 134 సినిమాల పాటల హక్కులు 'సరిగమ'కే చెందుతాయన్న ఢిల్లీ హైకోర్టు
- ఇళయరాజాకు ఎలాంటి హక్కులు లేవని తీర్పు
ప్రముఖ సినీ సంగీత దర్శకుడు ఇళయరాజా స్వరాలు దశాబ్దాలుగా సినీ ప్రపంచాన్ని, అభిమానులను ఉర్రూతలూగిస్తున్నాయి. ఆయన సొంత పాటలపై హక్కుల కోసం జరుగుతున్న చట్టపరమైన పోరు ఇప్పుడు కీలక మలుపు తీసుకుంది. ఢిల్లీ హైకోర్టు తాజాగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులు ఇళయరాజాకు ప్రతికూలంగా మారాయి.
1976 నుంచి 2001 మధ్య కాలంలో ఇళయరాజా సంగీతం అందించిన 134 సినిమాల ఆడియో హక్కులు ప్రముఖ ఆడియో సంస్థ ‘సరిగమ’కే చెందుతాయని కోర్టు స్పష్టం చేసింది. నాటి చిత్ర నిర్మాతలు ఈ హక్కులను శాశ్వతంగా సరిగమకు అమ్మేశారని, కాపీరైట్ చట్టం ప్రకారం ఇళయరాజాకు యాజమాన్య హక్కులు లేవని జస్టిస్ తుషార్ రావు గెడేలా తీర్పు ఇచ్చారు.
ఈ వివాదం ‘ఎప్ ఇనియా పొన్ నిలవే’ వంటి ఆల్‌టైమ్ హిట్ సాంగ్‌తో మొదలైంది. డిజిటల్ ప్లాట్‌ఫామ్‌లకు ఇళయరాజా అనుమతులు ఇవ్వగా సరిగమ సవాల్ చేసింది. “నిర్మాత వద్ద వేతనం తీసుకుని కంపోజ్ చేసిన పాటలపై హక్కులు నిర్మాతకే చెందుతాయి. ఈ క్రమంలో ఆ హక్కులు సరిగమకు బదిలీ అయ్యాయి” అని కోర్టు స్పష్టం చేసింది. అయితే, ఈ తీర్పుపై అప్పీల్ చేసే అవకాశాన్ని ఇళయరాజాకు కోర్టు కల్పించింది.