ఉద్రిక్తతలు ముదురుతున్న వేళ తమ్ముడికి కీలక సలహా ఇచ్చిన నవాజ్ షరీఫ్

  • పహల్గామ్ దాడి, ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్-పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు
  • పాక్ డ్రోన్లు, క్షిపణులతో భారత్‌పై దాడితో యుద్ధ వాతావరణం
  • పాక్ ప్రధాని షెహబాజ్‌కు సోదరుడు నవాజ్ షరీఫ్ కీలక సూచనలు
పహల్గామ్ ఉగ్రదాడి, ఆపరేషన్ సిందూర్ పరిణామాల అనంతరం భారత్, పాకిస్థాన్ మధ్య తీవ్ర ఉద్రిక్త వాతావరణం నెలకొంది. నిన్న రాత్రి పాకిస్థాన్ వందలాది డ్రోన్లతో భారత్‌పై దాడికి పాల్పడటంతో ఇరు దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకున్నాయి. పాక్ ప్రయోగించిన డ్రోన్లను భారత బలగాలు సమర్థవంతంగా కూల్చివేశాయి. ఈ సంక్లిష్ట పరిస్థితుల్లో పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్... ప్రస్తుత ప్రధాని, తన సోదరుడు అయిన షెహబాజ్ షరీఫ్‌కు కీలకమైన సలహాలు అందించినట్లు తెలుస్తోంది. ఉద్రిక్తతలను తగ్గించడానికి దౌత్యపరమైన విధానాలను అనుసరించాలని ఆయన సూచించినట్లు ‘ది ఎక్స్‌ప్రెస్ ట్రిబ్యూన్’ ఒక కథనంలో వెల్లడించింది.

పహల్గామ్ ఉగ్రదాడి ఘటన, భారత్ సింధు జలాల ఒప్పందాన్ని రద్దు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో లండన్‌లో ఉన్న నవాజ్ షరీఫ్ ఇటీవలే పాకిస్తాన్ తిరిగివచ్చారు. అణ్వస్త్ర శక్తి కలిగిన ఇరు దేశాల మధ్య శాంతిని పునరుద్ధరించేందుకు అందుబాటులో ఉన్న అన్ని దౌత్య మార్గాలను ఉపయోగించుకోవాలని ఆయన ప్రస్తుత ప్రధానికి సూచించినట్లు సమాచారం. గతంలో, 2023లో కూడా నవాజ్ షరీఫ్ మాట్లాడుతూ, భారత్‌తో సత్సంబంధాలు కొనసాగించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. 1999లో కార్గిల్ యుద్ధాన్ని తాను వ్యతిరేకించినందువల్లే తన ప్రభుత్వాన్ని కూలదోశారని ఆయన ఆరోపించారు.

1999లో అప్పటి సైనిక పాలకుడు పర్వేజ్ ముషారఫ్ జరిపిన సైనిక తిరుగుబాటులో నవాజ్ షరీఫ్ ప్రభుత్వం కూలిపోయిన విషయం తెలిసిందే. తన ప్రభుత్వ హయాంలో, అప్పటి భారత ప్రధాని అటల్ బిహారీ వాజ్‌పేయి శాంతి ఒప్పందం కుదుర్చుకోవడానికి లాహోర్ వచ్చారని, అయితే కార్గిల్ రూపంలో పాకిస్థాన్ ఆ ఒప్పందాన్ని ఉల్లంఘించిందని నవాజ్ గతంలో వ్యాఖ్యానించారు. 

ప్రస్తుత ఉద్రిక్త పరిస్థితుల్లో ఆయన చేసిన తాజా సూచనలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇరు దేశాల మధ్య ఉద్రిక్తతలు మరింత పెరగకుండా దౌత్యపరమైన చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకోవాలని ఆయన గట్టిగా సూచించినట్లు తెలుస్తోంది.


More Telugu News