పాక్ యుద్ధం కోరుకుంది.. భార‌త్ స‌రైన గుణ‌పాఠం చెబుతుంది: సెహ్వాగ్‌

  • వ‌క్రబుద్ధితో భార‌త్‌పై దాడికి దిగిన పాక్‌పై మాజీ క్రికెట‌ర్ మండిపాటు
  • భార‌త ఆర్మీని మెచ్చుకున్న నీర‌జ్ చోప్రా, శిఖ‌ర్ ధావ‌న్‌
  • అత్యంత ధైర్య‌వంత‌మైన భార‌త ఆర్మీ ప‌ట్ల గ‌ర్విస్తున్నామ‌న్న నీర‌జ్ చోప్రా
  • భార‌త్ బ‌లంగా నిల‌బ‌డుతుంద‌న్న‌ శిఖ‌ర్ ధావ‌న్‌
వ‌క్రబుద్ధితో భార‌త్‌పై దాడికి దిగిన‌ దాయాది పాకిస్థాన్‌పై టీమిండియా మాజీ క్రికెట‌ర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర స్థాయిలో విరుచుకుప‌డ్డాడు. పాక్ యుద్ధాన్ని ఎంచుకుంద‌ని.. భార‌త్ స‌రైన గుణ‌పాఠం చెబుతుందని తెలిపాడు. అలాగే ఒలింపిక్స్ మెడ‌లిస్ట్‌, జావెలిన్ త్రో స్టార్ నీర‌జ్ చోప్రా, మాజీ క్రికెట‌ర్ శిఖ‌ర్ ధావ‌న్‌ కూడా భార‌త ఆర్మీని మెచ్చుకున్నారు. 

"భార‌త సైన్యం ఉగ్ర‌వాద స్థావ‌రాల‌ను ధ్వంసం చేసిన‌ప్పుడు పాక్ మౌనంగా ఉండాలి. కానీ, ఆ ఛాన్స్‌ను వ‌దులుకుని యుద్ధాన్ని కోరుకుంది. ముష్క‌రుల ఆస్తుల‌ను కాపాడ‌టం, వారికి ర‌క్ష‌ణ‌గా ఉంటూ ఎక్కువ‌గా మాట్లాడ‌టం చేస్తోంది. దానికి మ‌న సైన్యం త‌ప్ప‌కుండా గుణ‌పాఠం చెబుతోంది. అదీనూ దాయాది దేశం ఎప్ప‌టికీ మ‌రిచిపోలేని స‌మాధానం ఇస్తాం" అని వీరూ చెప్పుకొచ్చాడు. 

భార‌త ఆర్మీకి ఇదే నా సెల్యూట్: నీర‌జ్ చోప్రా
"అత్యంత ధైర్య‌వంత‌మైన భార‌త ఆర్మీ ప‌ట్ల గ‌ర్విస్తున్నాం. దేశం కోసం ఉగ్ర‌వాదానికి వ్య‌తిరేకంగా పోరాడుతున్న భ‌ద్ర‌తా బ‌ల‌గాల‌కు ప్ర‌జ‌ల మ‌ద్ద‌తు ఎప్పుడూ ఉంటుంది. ఇలాంటి స‌మయంలో ప్ర‌భుత్వం జారీ చేసే మార్గ‌ద‌ర్శ‌కాల‌ను పాటించి సుర‌క్షితంగా ఉండాలి. జై భార‌త్‌. జై భార‌త్‌కీ సేన" అని నీర‌జ్ చోప్రా పోస్ట్ చేశాడు. 

భార‌త్ బ‌లంగా నిల‌బ‌డుతుంది: శిఖ‌ర్ ధావ‌న్‌
"స‌రిహ‌ద్దులో పాక్ చేసిన డ్రోన్ దాడుల‌ను భార‌త సైన్యం స‌మ‌ర్థంగా ఎదుర్కొంది. ధైర్య సాహ‌సాలు క‌లిగిన భార‌త ఆర్మీ నిబ‌ద్ధ‌త‌కు ఇదే నిద‌ర్శ‌నం. ఇండియా బ‌లంగా నిల‌బ‌డుతుంది. జై హింద్" అని గ‌బ్బ‌ర్ స్పందించాడు. 


More Telugu News