అది మాకు సంబంధం లేని విష‌యం: జేడీ వాన్స్

  • భార‌త్‌-పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త ప‌రిస్థితుల‌పై అమెరికా ఉపాధ్య‌క్షుడు ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
  • ఈ విష‌యంలో అమెరికా ఎట్టిప‌రిస్థితుల్లో జోక్యం చేసుకోద‌ని స్ప‌ష్టీక‌ర‌ణ‌
  • ఇరుదేశాలు అగ్ర‌రాజ్యం నియంత్ర‌ణ‌లో లేవ‌న్న జేడీ వాన్స్‌
భార‌త్‌-పాకిస్థాన్ మ‌ధ్య ఉద్రిక్త‌త ప‌రిస్థితుల‌పై అమెరికా ఉపాధ్య‌క్షుడు జేడీ వాన్స్ ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. అది త‌మ‌కు సంబంధం లేని విష‌యమ‌ని అన్నారు. అందులో అమెరికా ఎట్టిప‌రిస్థితుల్లో జోక్యం చేసుకోద‌ని స్ప‌ష్టం చేశారు. దాయాది దేశాల మ‌ధ్య వివాదం త‌మ‌కు సంబంధించిన‌ది కాద‌ని, ఇరుదేశాలు అగ్ర‌రాజ్యం నియంత్ర‌ణ‌లో లేవ‌ని వాన్స్‌ పేర్కొన్నారు. 

అమెరికా ఉపాధ్య‌క్షుడు శుక్ర‌వారం ఫాక్స్ న్యూస్‌తో మాట్లాడుతూ... భార‌త్‌, పాక్ మ‌ధ్య నెల‌కొన్న వివాదం సాధ్య‌మైనంత‌ త్వ‌ర‌గా స‌మ‌సిపోవాల‌ని అమెరికా కోరుకుంటుంద‌న్నారు. అయితే, ఈ దేశాల‌ను తాము నియంత్రించ‌లేమ‌ని, ప్రాథ‌మికంగా భార‌త్‌కు పాక్‌తో విభేదాలు ఉన్నాయ‌ని తెలిపారు. ఈ విష‌యంలో యూఎస్ చేయ‌గ‌లిగేది ఏమిటంటే... ఈ ఘ‌ర్ష‌ణ‌ను కొంచెం త‌గ్గించ‌మ‌ని ఇరుదేశాల‌ను కోర‌డం మాత్ర‌మేన‌ని ఆయ‌న చెప్పుకొచ్చారు. 

అటు అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా భార‌త్‌, పాక్ మ‌ధ్య నెల‌కొన్న ఉద్రిక్త‌త ప‌రిస్థితులు తొల‌గిపోవాల‌ని కోరారు.  ప్ర‌స్తుతం రెండు దేశాలు పూర్తిగా విరుద్ధ అభిప్రాయాల‌తో ఉన్నాయ‌ని అన్నారు. కానీ, వారు త‌మ మ‌ధ్య ఘ‌ర్ష‌ణ‌ల‌ను ఆప‌గ‌ల‌ర‌ని ఆశిస్తున్నాన‌న్నారు. త‌న‌కు రెండు దేశాలు బాగా తెలుసు అన్న ట్రంప్‌... యుద్ధాన్ని ఆపేందుకు ఏదైనా స‌హాయం కొరితే త‌ప్ప‌కుండా చేస్తాన‌ని స్ప‌ష్టం చేశారు.  


More Telugu News