Rajnath Singh: ఆపరేషన్‌ సిందూర్‌లో 100 మంది ఉగ్రవాదులు హతం: రాజ్‌నాథ్‌ సింగ్‌

100 Terrorists Killed in Operation Sundar says Rajnath Singh
షార్ట్స్‌లో చూడండి
‘ఆపరేషన్‌ సిందూర్‌’లో 100 మంది ఉగ్రవాదులు హతమైనట్లు కేంద్రం తాజాగా ప్రకటించింది. ఈరోజు ఉదయం కేంద్రం అఖిలపక్ష భేటీ నిర్వహించిన విషయం తెలిసిందే. ఈ భేటీలో ఆపరేషన్‌ సిందూర్‌కు సంబంధించిన వివరాలను రక్షణమంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. పాకిస్థాన్‌, పీఓకేలోని ఉగ్రస్థావరాలపై భార‌త‌ ఆర్మీ చేపట్టిన దాడుల్లో 100 మంది మరణించినట్లు రాజ్‌రాథ్‌ తెలిపారు. ఆప‌రేష‌న్ సిందూర్ కొన‌సాగుతుంద‌ని ఆయ‌న స్ప‌ష్టం చేశారు. 

రాజ్‌నాథ్‌ సింగ్ మాట్లాడుతూ...  పాకిస్థాన్‌, పీఓకేలోని తొమ్మిది ఉగ్రస్థావరాలపై క‌చ్చిత‌త్వంతో క్షిప‌ణి దాడుల‌ను నిర్వ‌హించాం. ఈ దాడుల్లో 100 మంది ముష్క‌రుల‌ను మ‌ట్టుబెట్టాం. దీనికి సంబంధించిన మ‌రింత స‌మాచారం కోసం ఎదురుచూస్తున్నాం. ప్ర‌స్తుతం ఉద్రిక్త ప‌రిస్థితులు కొన‌సాగుతున్నందున ఈ ఆప‌రేష‌న్ తాలూకు పూర్తి స‌మాచారాన్ని ఇప్పుడే వెల్ల‌డించ‌లేం. ఈ ఉద్రిక్త‌త‌ల‌ను పెంచాల‌నే ఉద్దేశం మాకు లేదు. కానీ, దాయాది పాక్ రెచ్చ‌గొట్టే చ‌ర్య‌ల‌కు పాల్ప‌డితే మాత్రం... వెన‌క్కి త‌గ్గేదిలేదు. దీటుగా బ‌దులిస్తాం. ఆప‌రేష‌న్ సిందూర్ కొన‌సాగుతుంది అని అన్నారు.  

దేశం కోసం కేంద్రం తీసుకునే చ‌ర్య‌ల‌కు పూర్తి మ‌ద్ద‌తు: రాహుల్ గాంధీ
అఖిల ప‌క్ష భేటీలో పాల్గొన్న కాంగ్రెస్ అగ్ర‌నేత‌, ఎంపీ రాహుల్ గాంధీ మాట్లాడుతూ... దేశం కోసం కేంద్రం తీసుకునే చ‌ర్య‌ల‌కు పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించారు. ఆప‌రేష‌న్ సిందూర్‌పై ప్ర‌తిప‌క్షాలు ఐక్యంగా నిలిచి ప్ర‌భుత్వానికి అండ‌గా ఉంటాయ‌న్నారు. ఆప‌రేష‌న్ సిందూర్ ఇంకా కొన‌సాగుతుంద‌ని మంత్రి రాజ్‌నాథ్ చెప్పిన‌ట్లు రాహుల్ గాంధీ వెల్ల‌డించారు.   

ప్ర‌తిప‌క్షాలు అత్యంత ప‌రిణితితో వ్య‌వ‌హ‌రించాయి: కిర‌ణ్ రిజిజు
ఆప‌రేష‌న్ సిందూర్‌పై అఖిల ప‌క్ష స‌మావేశం త‌ర్వాత కేంద్ర‌మంత్రి కిర‌ణ్ రిజిజు మీడియాతో మాట్లాడారు. "ఆప‌రేష‌న్ సిందూర్ వివ‌రాల‌ను, ప్ర‌భుత్వ ఉద్దేశాల‌ను ర‌క్ష‌ణ‌మంత్రి ప్ర‌తిప‌క్ష నేత‌ల‌కు వివ‌రించారు. ప్ర‌స్తుతం ఇంకా ఆప‌రేష‌న్ కొన‌సాగుతోంది క‌నుక సాంకేతిక వివ‌రాల‌ను ఆయ‌న వెల్ల‌డించ‌లేక‌పోయారు. ప్ర‌తిప‌క్షాలు అత్యంత ప‌రిణితితో వ్య‌వ‌హ‌రించాయి. ప్ర‌భుత్వానికి పూర్తి మ‌ద్ద‌తు ప్ర‌క‌టించాయి. ఈ అంశంలో రాజ‌కీయాల‌కు తావులేదు" అని కిర‌ణ్ రిజిజు తెలిపారు.  

కాగా, ఏప్రిల్ 22న పహల్గామ్‌లో పర్యాటకులపై దాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాదులపై భారత్ బుధ‌వారం ప్రతీకారం తీర్చుకున్న విషయం తెలిసిందే. ఆ ఉగ్రమూకలను పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌పై బుధ‌వారం తెల్ల‌వారుజామున‌ తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ పేరుతో ప్రతిదాడికి దిగి పాక్‌ ఆక్రమిత కశ్మీర్‌ (పీఓకే)తో పాటు పాకిస్థాన్‌లోని మూడు ప్రధాన ఉగ్రవాద సంస్థలు జైషే మహ్మద్‌, లష్కరే తోయిబా, హిజ్బుల్‌ ముజాహిదీన్‌లకు చెందిన తొమ్మిది ఉగ్ర స్థావరాలను నేల‌మ‌ట్టం చేసింది. ఈ దాడితో జైషే చీఫ్‌ మసూద్‌ అజార్‌ కుటుంబంలోని 10 మంది ప్రాణాలు కోల్పోయారు.
Go Back to Shorts
Rajnath Singh
Operation Sundar
Pakistan
PoK
Terrorists
India
Surgical Strike
Jaish-e-Mohammed
Rahul Gandhi
Kiren Rijiju

More Telugu News