ఎల్ఓసీ వద్ద అరుదైన దృశ్యం.. కరచాలనం చేసుకున్న భారత్, పాక్ సైనికాధికారులు

Rare scene at LoC as Indian and Pakistani military officers shake hands
  • పొరపాటున నియంత్రణ రేఖ దాటిన పాకిస్థాన్ పౌరుడిని తిరిగి అప్పగించిన భారత సైన్యం
  • జూన్ 12న కుప్వారా సెక్టార్‌లో అదుపులోకి తీసుకున్న భద్రతా బలగాలు
  • విచారణలో ఉగ్ర సంబంధాలు లేవని తేలడంతో మానవతా దృక్పథంతో నిర్ణయం
  • అప్పగింత సమయంలో భారత్, పాక్ సైనికాధికారులు కరచాలనం చేసుకోవడం విశేషం
  • పౌరుడిని గౌరవంగా చూసుకున్నామని భారత సైన్యంలోని చినార్ కార్ప్స్ ప్రకటన
జమ్ముకశ్మీర్‌లోని నియంత్రణ రేఖ (ఎల్ఓసీ) వద్ద ఓ అరుదైన దృశ్యం ఆవిష్కతమైంది. పొరపాటున సరిహద్దు దాటి భారత భూభాగంలోకి ప్రవేశించిన ఓ పాకిస్థాన్ జాతీయుడిని భారత సైన్యం తిరిగి ఆ దేశానికి అప్పగించింది. ఈ క్రమంలో ఇరు దేశాల సైనికాధికారులు కరచాలనం చేసుకోవడం సరిహద్దుల్లో నెలకొన్న ఉద్రిక్తతల మధ్య ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. గత కొన్నాళ్లుగా ఇరు దేశాల మధ్య ఏ రంగంలోనూ, ఏ స్థాయిలోనూ కరచాలనాలు లేకపోవడం తెలిసిందే.

పాకిస్థాన్‌లోని ఖైబర్ పఖ్తూంఖ్వా ప్రావిన్స్‌కు చెందిన అసద్ ఖాన్ అనే యువకుడు జూన్ 12న పొరపాటున నియంత్రణ రేఖ దాటి జమ్ముకశ్మీర్‌లోని కుప్వారా జిల్లాలోకి ప్రవేశించాడు. టీట్వాల్ సెక్టార్ పరిధిలోని సిమారి గ్రామంలో అతడిని భద్రతా బలగాలు అదుపులోకి తీసుకున్నాయి. అనంతరం నిర్దేశిత నిబంధనల ప్రకారం జరిపిన విచారణలో.. అతడికి ఎటువంటి ఉగ్రవాద కార్యకలాపాలతోగానీ, భద్రతాపరమైన అంశాలతోగానీ సంబంధం లేదని తేలింది.

దీంతో మానవతా దృక్పథంతో అసద్ ఖాన్‌ను తిరిగి పాకిస్థాన్‌కు అప్పగించాలని భారత అధికారులు నిర్ణయించారు. జూన్ 18న సరిహద్దు క్రాసింగ్ పాయింట్ వద్ద అతడిని పాక్ సైనిక అధికారులకు అప్పగించారు. "భారత్‌లో ఉన్నంతకాలం అసద్ ఖాన్‌ను ఎంతో గౌరవంగా, మానవత్వంతో చూసుకున్నాం. ఇది భారత సైన్యం పాటించే మానవతా విలువలకు, ఉన్నతమైన వృత్తి నైపుణ్యానికి నిదర్శనం" అని చినార్ కార్ప్స్ ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ అప్పగింతకు సంబంధించిన ఫొటోలను కూడా సైన్యం విడుదల చేసింది. ఈ చిత్రాల్లో ఇరు దేశాల అధికారులు కరచాలనం చేసుకోవడం గమనార్హం.
Go Back to Shorts
Indian Army
Pakistan Army
Line of Control
Asad Khan
Jammu and Kashmir
Teetwal Sector

More Telugu News