కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్ భార్యకు పాకిస్థాన్ ఆర్మీతో సన్నిహిత సంబంధాలు!: అసోం సీఎం

  • గౌరవ్ గొగోయ్ పాక్ పర్యటనపై హిమంత ప్రశ్నల వర్షం
  • ఎలిజబెత్ 19 సార్లు పాక్ వెళ్లారన్న హిమంత
  • ఎలిజబెత్ గతంలో పాకిస్థాన్‌లో పని చేశారన్న అసోం ముఖ్యమంత్రి
అసోం ముఖ్యమంత్రి హిమంత బిశ్వ శర్మ... కాంగ్రెస్ పార్టీ ఎంపీ గౌరవ్ గొగోయ్, ఆయన అర్ధాంగి ఎలిజబెత్ కోల్‌బర్న్‌‌లను లక్ష్యంగా చేసుకుని తీవ్ర విమర్శలు చేశారు. ఎలిజబెత్ కోల్‌బర్న్‌కు పాకిస్థాన్ సైన్యంతో సన్నిహిత సంబంధాలున్నాయని, ఆమె పలుమార్లు పాకిస్థాన్‌లో పర్యటించారని హిమంత బిశ్వ శర్మ ఆరోపించారు. గౌహతిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.

ఎలిజబెత్ కోల్‌బర్న్ దాదాపు 19 సార్లు భారతదేశం నుంచి పాకిస్థాన్‌కు ప్రయాణించారని ముఖ్యమంత్రి హిమంత పేర్కొన్నారు. పాకిస్థాన్‌లో ఆమె పర్యటించిన సమయంలో అక్కడి సైన్యం ఆమెకు అన్ని విధాలా సహకరించిందని ఆయన ఆరోపించారు. అంతేకాకుండా, ఎలిజబెత్ గతంలో పాకిస్థాన్‌లో పనిచేశారని, ఆ తర్వాత ఢిల్లీలోని ఒక ఎన్జీవో సంస్థలో చేరినప్పటికీ, పాకిస్థాన్ నుంచి క్రమం తప్పకుండా జీతం అందుకున్నారని శర్మ ఆరోపణలు చేశారు.

ఈ సందర్భంగా ఎంపీ గౌరవ్ గొగోయ్ పాకిస్థాన్ పర్యటనను కూడా హిమంత బిశ్వ శర్మ ప్రస్తావించారు. గౌరవ్ గొగోయ్ కూడా పాకిస్థాన్‌కు వెళ్లారని, ఆయన భార్య వారం రోజుల్లో తిరిగి రాగా, గొగోయ్ మాత్రం మరో ఏడు రోజులు అక్కడే ఉన్నారని తెలిపారు. పాకిస్థాన్‌లో మొత్తం 15 రోజుల పాటు గౌరవ్ గొగోయ్ ఏం చేశారో, అక్కడి సైన్యానికి ఏ విధంగా సహకరించారో ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ఒకవేళ గౌరవ్ గొగోయ్ అధికారిక హోదాలో పాకిస్థాన్‌కు వెళ్లి ఉంటే తాము ప్రశ్నించేవాళ్లం కాదని, కానీ ఆయన తన వ్యక్తిగత పనుల మీద వెళ్లారని, అక్కడ ఎవరితో బస చేశారో, ఎవరిని కలిశారో తెలియజేయాలని హిమంత బిశ్వ శర్మ డిమాండ్ చేశారు.


More Telugu News