త్వరలోనే ఏపీకి ట్రాన్స్ మీడియా ఎంటర్టైన్‌మెంట్ సిటీ: మంత్రి కందుల దుర్గేశ్

  • ముంబయిలో జరిగిన వేవ్స్ సమ్మిట్ -2025 లో ఏపీ ప్రభుత్వం, క్రియేటివ్ ల్యాండ్ ఆసియా మధ్య ఎంవోయూ
  • క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఆవిష్కరణలతో పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహం లభిస్తుందన్న టూరిజం ఎండీ ఆమ్రపాలి కాట
భారతదేశపు మొట్టమొదటి ట్రాన్స్‌ మీడియా ఎంటర్‌టైన్‌మెంట్ సిటీని ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, క్రియేటివ్‌ల్యాండ్ ఆసియా సంస్థలు ముంబయిలో జరుగుతున్న వేవ్స్ సమ్మిట్-2025లో సహకారం అందించుకోనున్నాయని మంత్రి కందుల దుర్గేశ్ ఒక ప్రకటనలో తెలిపారు. మే 1 నుంచి 4 వరకు తొలిసారిగా ఇండియాలో, ప్రత్యేకించి ముంబయిలో జరుగుతున్న ప్రతిష్ఠాత్మక వేవ్స్ (ది వరల్డ్ ఆడియో విజువల్ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ సమ్మిట్)-2025లో ఈ మేరకు ఏపీ ప్రభుత్వం, క్రియేటివ్ ల్యాండ్ ఆసియా మధ్య అవగాహన ఒప్పందం (MOU) జరిగిందని ఆయన పేర్కొన్నారు.

ఈ ఎంవోయూ ద్వారా ఏపీకి వచ్చే పర్యాటకులు లీనమయ్యేలా థీమ్ పార్క్‌లు, గేమింగ్ జోన్‌లు, గ్లోబల్ సినిమా కో-ప్రొడక్షన్ జోన్‌లు ఏర్పాటు కానున్నాయని మంత్రి దుర్గేశ్ వెల్లడించారు. అంతేకాకుండా, ఉద్యోగ సృష్టి, నైపుణ్య అభివృద్ధి, పర్యాటకం, డిజిటల్ ఆవిష్కరణలను ప్రోత్సహించేందుకు ఈ ఎంవోయూ దోహదం చేస్తుందని మంత్రి దుర్గేశ్ వివరించారు.

ప్రస్తుతం మంత్రి కందుల దుర్గేశ్ వియత్నాంలో ఉండగా, పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి కాట, క్రియేటివ్‌ల్యాండ్ స్టూడియోస్ వ్యవస్థాపకురాలు, క్రియేటర్స్ ఇంక్ లండన్ చైర్మన్ సాజన్ రాజ్ కురుప్, హాలీవుడ్ నుండి గ్లోబల్ అడ్వైజరీ బోర్డు ప్రతినిధులు డేవిడ్ ఉంగర్ (సీఈవో ఆర్టిస్ట్స్ ఇంటర్నేషనల్), గ్లోబల్‌గేట్ మేనేజింగ్ డైరెక్టర్ విలియం ఫైఫర్, నికోలస్ గ్రానాటినో (చైర్మన్ నోవాక్వార్క్) ఈ ఎంవోయూపై సంతకాలు చేశారు. ఇటీవలే క్రియేటివ్ ల్యాండ్ ఆసియా ప్రతినిధులు కొందరు వెలగపూడి సచివాలయంలోని మంత్రి కార్యాలయంలో ఈ విషయంపై చర్చించారు. మంత్రి సమక్షంలో అవగాహన ఒప్పంద పత్రాలు మార్చుకున్నారు.

పర్యాటక శాఖ ఎండీ ఆమ్రపాలి కాట మాట్లాడుతూ క్రియేటర్ ల్యాండ్ ప్రాజెక్ట్ ఆవిష్కరణలతో పర్యాటక రంగాన్ని మరింత ప్రోత్సహిస్తున్నామని అన్నారు. వినోద మౌలిక సదుపాయాలు, ప్రతిభ నైపుణ్యాలు, పర్యాటకం కలిసి జీవనోపాధిని సృష్టించడానికి, స్థానిక ఆర్థిక వ్యవస్థను పెంచడానికి, ప్రపంచ సృజనాత్మక పటంలో ఆంధ్రప్రదేశ్ ప్రొఫైల్‌ను పెంచడానికి ఇది ఒక సమగ్ర దృక్పథాన్ని అందిస్తుందని తెలిపారు. భవిష్యత్తుకు సిద్ధంగా ఉన్న మౌలిక సదుపాయాలు సమ్మిళిత వృద్ధిని ఎలా నడిపిస్తాయో చెప్పడానికి ఇది ఒక బ్లూప్రింట్‌గా తాము భావిస్తున్నామని ఆమె వివరించారు. 


More Telugu News