మాజీ మంత్రి జవహర్ ఇంట్లో చోరీ

  • ప్రధాని మోదీ సభకు ఇన్‌చార్జిగా వెళ్లిన మాజీ మంత్రి జవహర్
  • మూడు రోజుల క్రితం స్వగ్రామం తిరువూరుకు వెళ్లిన జవహర్ అర్ధాంగి, కుమారుడు 
  • జవహర్ నివాసంలో వెండి వస్తువులు, ఖరీదైన వాచీలు, నగదు అపహరణ 
కొవ్వూరు పట్టణంలోని మాజీ మంత్రి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత కె.ఎస్. జవహర్ నివాసంలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి విలువైన వస్తువులను అపహరించుకుపోయారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ సభకు ఇన్‌ఛార్జ్‌గా నియమితులైన జవహర్ పది రోజుల క్రితం గుడివాడ వెళ్లారు. మూడు రోజుల క్రితం ఆయన అర్ధాంగి, పిల్లలు స్వగ్రామమైన తిరువూరుకు వెళ్లారు.

శనివారం నాడు ఇంట్లోని మొక్కలకు నీళ్లు పోసేందుకు జవహర్ అనుచరుడు వి.వి. రాజు ఇంటికి వచ్చాడు. ఇంటి వెనుకవైపు తలుపు తెరిచి ఉండటంతో అనుమానం వచ్చి చూడగా, ఇంట్లో వస్తువులు చిందరవందరగా పడి ఉండటాన్ని గమనించాడు. వెంటనే ఆయన స్థానిక పోలీసులకు, జవహర్‌కు సమాచారం అందించాడు.

డీఎస్పీ జి. దేవకుమార్, పట్టణ సీఐ పి. విశ్వం ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ఇంట్లో దొంగలు పడినట్లు సమాచారం తెలియడంతో జవహర్ అర్ధాంగి ఉష, కుమారుడు కొత్తపల్లి ఆశిష్ లాల్ వెంటనే కొవ్వూరు చేరుకున్నారు. ప్రాథమికంగా రెండు సెల్ ఫోన్లు, ఖరీదైన వాచీలు, ఒక టీవీ, రూ.45 వేల నగదు, వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు తెలుస్తోంది. రాజమండ్రి నుంచి క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్‌లను రప్పించి జవహర్ నివాసంలో వేలిముద్రలు సేకరించారు. జవహర్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. 


More Telugu News