నౌక, జలాంతర్గామి, హెలికాప్టర్ చిత్రాన్ని షేర్ చేసిన ఇండియన్ నేవీ

  • 'భారత నేవీ త్రిశూల శక్తి, సముద్రంపై, నీటి కింద, అలల మీద' అంటూ క్యాప్షన్
  • విధ్వంసక నౌక, సబ్ మెరైన్, హెలికాప్టర్‌తో కూడిన ఫోటోను పంచుకున్న నేవీ
  • సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారమవుతున్న చిత్రం
  • పహల్గామ్ దాడి తర్వాత పాక్‌తో ఉద్రిక్తతల నేపథ్యంలో ఫొటో షేర్ చేసిన నేవీ
భారత నౌకాదళం తమ సత్తాకు నిదర్శనంగా నిలిచే ఒక చిత్రాన్ని 'ఎక్స్' వేదికగా పంచుకుంది. సముద్ర గస్తీలో ఉన్న కీలక యుద్ధ నౌక, జలాంతర్గామి, తేలికపాటి హెలికాప్టర్‌తో కూడిన ఈ ఫొటో ప్రస్తుతం ఆన్‌లైన్‌లో విస్తృతంగా ప్రచారమవుతోంది.

ఈ ఫొటోలో ఐఎన్ఎస్ కోల్‌కతా అనే విధ్వంసక నౌక, స్కార్పీన్ శ్రేణికి చెందిన జలాంతర్గామి, ధ్రువ్ అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ (ఏఎల్ హెచ్) తమ విధుల్లో నిమగ్నమై ఉండటాన్ని చూడవచ్చు.

"భారత నేవీ త్రిశూల శక్తి.. సముద్రం పైన.. కింద.. అలల మీదుగా" అని అర్థం వచ్చేలా ఆ ఫొటోకు శీర్షిక ఇచ్చింది. 'ఎనీ టైమ్ ఎనీ వేర్ ఎనీ హౌ' అనే క్యాప్షన్‌ను జత చేసింది. ఇది సముద్ర జలాల్లో నిరంతరాయంగా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా కార్యకలాపాలు నిర్వహించగల తమ సామర్థ్యాన్ని సూచిస్తోంది.

ఇటీవల కశ్మీర్‌లోని పహల్గామ్‌లో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాద దాడి నేపథ్యంలో, పాకిస్థాన్‌తో మరోసారి ఉద్రిక్తతలు నెలకొన్న తరుణంలో నౌకాదళం ఈ చిత్రాన్ని పంచుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది. అయితే, ఫోటోలో కనిపిస్తున్న ధ్రువ్ ఏఎల్ హెచ్ హెలికాప్టర్ల కార్యకలాపాలను కొన్ని నెలల క్రితం తాత్కాలికంగా నిలిపివేశారు.

కొన్ని నెలల క్రితం నిలిపివేసిన ఆధునాతన తేలికపాటి హెలికాప్టర్ ధ్రువ్ కార్యకలాపాలను పునరుద్ధరించేందుకు ఇటీవల ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఆర్మీ ఎయిర్ ఫోర్స్‌లో వాటికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినప్పటికీ నౌకాదళంలో ఉన్న ఈ హెలికాప్టర్లకు మాత్రం అనుమతి ఇవ్వలేదని సమాచారం.

స్కార్పీన్ తరగతి జలాంతర్గాములు, ఫ్రాన్స్ సహకారంతో నిర్మితమై, అత్యాధునిక స్టెల్త్ పరిజ్ఞానాన్ని కలిగి ఉన్నాయి. ఇవి శత్రు యుద్ధనౌకలు, జలాంతర్గాములను గుర్తించి దాడి చేయడం, నిఘా సమాచారాన్ని సేకరించడం, సముద్ర గర్భంలో వ్యూహాత్మకంగా మైన్‌లను అమర్చడం వంటి క్లిష్టమైన కార్యకలాపాలను సమర్థవంతంగా నిర్వహించగలవు. భారత్ నౌకాదళంలో ఐఎన్ఎస్ కోల్‌కతా ప్రధాన డిస్ట్రాయర్. ఇది భారత నౌకాదళానికి చెందిన శక్తివంతమైన యుద్ధ నౌకల్లో ఒకటి.


More Telugu News