సీఎం చంద్రబాబును కలిసిన అనంత జిల్లా ఎమ్మెల్యేలు .. కీలక అంశంపై వినతి

  • ఆర్డీటీ సమస్య పరిష్కారించాలని సీఎం చంద్రబాబుకు ఉమ్మడి అనంతపురం జిల్లా ఎమ్మెల్యేల వినతి 
  • ఎఫ్‌సీఆర్ఏ పునరుద్ధరణకు చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి  
  • కేంద్రం దృష్టికి తీసుకెళ్లి సమస్యను పరిష్కరిస్తామని హామీ ఇచ్చిన సీఎం
రాష్ట్రంలోని వివిధ గ్రామీణ ప్రాంతాలకు సేవలందిస్తున్న ఆర్డీటీకి విదేశాల నుంచి వచ్చే నిధుల వినియోగానికి సంబంధించిన ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ యాక్ట్‌ను కేంద్రం నిలిపివేసిందని, దీని పునరుద్ధరణకు చొరవ తీసుకోవాలని ఉమ్మడి అనంతపురం జిల్లాకు చెందిన ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి చంద్రబాబును కోరారు. ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, పరిటాల సునీత, బండారు శ్రావణి, అమిలినేని సురేంద్రబాబు, దగ్గుపాటి వెంకటేశ్వరప్రసాద్ బుధవారం సీఎంను సచివాలయంలో కలిసి వినతిపత్రం అందించారు.

ఉమ్మడి అనంతపురం జిల్లాలో విదేశీ విరాళాల ద్వారా ఆర్డీటీ నడుస్తోందని, ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని మారుమూల ప్రాంతాల్లోనూ ఈ ట్రస్ట్ వైద్య సేవలు అందిస్తోందని ఎమ్మెల్యేలు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. లోకల్ కాంట్రిబ్యూషన్ ఖాతాలో నిధులు జమ చేయడం సమస్యగా మారిందని, ఈ నిధులను ఇతర ఎన్జీవో కార్యకలాపాలకు వాడుతున్నారన్న అభియోగంతో సంస్థ రిజిస్ట్రేషన్‌ను కేంద్రం నిలిపివేసిందని తెలిపారు.

ఎఫ్‌సీఆర్ఏ రెన్యువల్‌ను ఆర్డీటీ కోరుతోందని, దీనికి రాష్ట్ర ప్రభుత్వం తరపున సాయం అందించాలని వారు కోరారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందిస్తూ సమస్యను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు.



More Telugu News