Andhra Pradesh Weather: ఏపీలో సాధారణం కంటే అధిక ఉష్ణోగ్రతలు.. మార్చిలో భానుడి భగభగలు!

Andhra Pradesh Weather Above Normal Temperatures Expected in March
  • మార్చి తొలి వారంలోనే వేసవి తాపంపై వాతావరణ శాఖ హెచ్చరిక
  • దేశవ్యాప్తంగా 2 నుంచి 6.5 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతల నమోదుకు అవకాశం ఉందన్న ఐఎండీ
  • ఏపీలో మార్చి తొలివారంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటే అవకాశం ఉందన్న అమరావతి వాతావరణ కేంద్రం
  • అనంతపురంలో గురువారం అత్యధికంగా 36.6 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదు
వాతావరణ మార్పుల ప్రభావంతో వేసవి కాలం రాకముందే భానుడు తన ప్రతాపాన్ని చూపిస్తున్నాడు. మార్చి మొదటి వారంలో దేశంలోని పలు ప్రాంతాల్లో ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2 నుంచి 6.5 డిగ్రీలు ఎక్కువగా నమోదయ్యే అవకాశం ఉందని భారత వాతావరణ విభాగం (ఐఎండీ) హెచ్చరించింది. ఈ నేపథ్యంలో మార్చి నెలలోనే ఎండలు, ఉక్కపోత తీవ్రంగా ఉండనున్నాయి. 

రాజస్థాన్‌, ఒడిశా, ఛత్తీస్‌గఢ్‌తో పాటు పశ్చిమ, దక్షిణ భారతంలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు 34 నుంచి 37 డిగ్రీల మధ్య నమోదవుతాయని ఐఎండీ అంచనా వేసింది. ఇక ఆంధ్రప్రదేశ్‌లోనూ మార్చి తొలి రోజుల్లోనే గరిష్ఠ ఉష్ణోగ్రతలు 36 డిగ్రీలు దాటవచ్చని అధికారులు పేర్కొంటున్నారు. ముఖ్యంగా కోస్తా జిల్లాల్లో సాధారణం కన్నా 2 నుంచి 4 డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే సూచనలు ఉన్నాయి. 

రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం పొడి వాతావరణం ఉంటుందని, ఉత్తర కోస్తాలో ఒకటి రెండు చోట్ల పొగమంచు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. గురువారం నాటికే రాష్ట్రంలో ఎండ తీవ్రత పెరిగింది. అనంతపురంలో అత్యధికంగా 36.6 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. నరసాపురం, మచిలీపట్నం, కావలి వంటి ప్రాంతాల్లో సాధారణం కంటే 2 డిగ్రీల మేర అధిక ఉష్ణోగ్రతలు నమోదైనట్లు అధికారులు తెలిపారు.
 
Andhra Pradesh Weather
AP Weather
Heat Wave
IMD
Amaravati Meteorological Center
Summer Heat
March Temperatures
Coastal Andhra
High Temperatures

More Telugu News