ఈ సమావేశంలో యాంత్రికంగా కాదు… ఒక భావోద్వేగ బంధంతో పాల్గొన్నాను: సీఎం రేవంత్ రెడ్డి

Revanth Reddy attends meeting with Group 1 and 2 probation officers
  • శిక్షణ పూర్తి చేసుకున్న గ్రూప్-1, 2 అధికారులతో సీఎం రేవంత్ భేటీ
  • ముఖ్యమంత్రిగా కాకుండా పెద్దన్నలా కలిశానన్న రేవంత్
  • నియామకాలను అడ్డుకునేందుకు జరిగిన కుట్రలను ఛేదించామని వెల్లడి
  • పేదలకు సేవ చేయాలని యువ అధికారులకు సూచన
  • ప్రభుత్వ ఉద్యోగులపై ఉన్న నానుడిని చెరిపేయాలని పిలుపు
తెలంగాణ రాష్ట్ర తొలి గ్రూప్-1, గ్రూప్-2 అధికారులుగా ఎంపికై శిక్షణ పూర్తి చేసుకున్న యువ అధికారులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని ఎంసీఆర్‌హెచ్‌ఆర్‌డీ ప్రాంగణంలో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం పాల్గొన్నారు. ఈ సమావేశానికి తాను ముఖ్యమంత్రిగా కాకుండా, ఆ యువ అధికారులకు ఒక పెద్దన్నగా వచ్చానని, యాంత్రికంగా కాకుండా పూర్తి భావోద్వేగ బంధంతో మాట్లాడానని ఆయన తెలిపారు. రాష్ట్ర పునర్నిర్మాణంలో భాగస్వాములు కాబోతున్న యువ సోదర, సోదరీమణులను కలవడం గొప్ప అనుభూతినిచ్చిందని పేర్కొన్నారు.

ఈ నియామకాలకు సంబంధించి జరిగిన న్యాయపోరాటాన్ని సీఎం రేవంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. కొందరు దుష్టశక్తులు ఈ యువత భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేందుకు న్యాయవ్యవస్థ ద్వారా ప్రయత్నించాయని ఆరోపించారు. వారి టాలెంట్‌ను తక్కువ చేస్తూ, ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే కుట్రలు చేశారని విమర్శించారు. అయితే ప్రజా ప్రభుత్వం గట్టిగా నిలబడి, అదే న్యాయపోరాటంతో ఆ కుట్రలను ఛేదించిందని, అభ్యర్థుల జీవితాల్లో వెలుగులు నింపడం తనకు పూర్తి సంతృప్తినిచ్చిందని వివరించారు. ఈ విజయం ప్రభుత్వ చిత్తశుద్ధికి నిదర్శనమని పేర్కొన్నారు.

అత్యంత పేదరికం నేపథ్యం నుంచి, తల్లిదండ్రుల చెమట చుక్కల స్ఫూర్తితో ఈ యువత ఉన్నత స్థాయికి ఎదగడం అద్వితీయమైన అనుభూతినిస్తోందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. సొంత గడ్డకు సేవ చేసేందుకు వారు సిద్ధమవడం ఎంతో గర్వకారణమని చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులపై సమాజంలో ఉన్న ‘గరం, నరం, బేషరం’ అనే నానుడిని ఈ యువ అధికారులు తమ పనితీరుతో తప్పు అని నిరూపించాలని ఆకాంక్షించారు. ఉద్యోగంలో చేరిన రోజున ఏ అంకితభావంతో ఉంటారో, ఉద్యోగ విరమణ చేసే రోజు వరకు అదే స్ఫూర్తితో పేదలకు సేవ చేయాలని ఆయన పిలుపునిచ్చారు. అధికారులుగా ప్రజలకు జవాబుదారీగా ఉండాలని, వారి సమస్యల పరిష్కారానికి చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు.
Go Back to Shorts
Revanth Reddy
Group-1
Group-2
Congress
Telangana

More Telugu News