బ‌దులు తీర్చుకున్న బెంగ‌ళూరు.. ఢిల్లీపై అద్భుత‌మైన విజ‌యం

  • అరుణ్‌ జైట్లీ స్టేడియంలో నిన్న‌డీసీ, ఆర్‌సీబీ మ్యాచ్‌
  • 6 వికెట్ల తేడాతో ఢిల్లీని ఓడించిన‌ బెంగ‌ళూరు
  • ఇంత‌కుముందు డీసీ చేతిలో సొంత‌మైదానంలో క‌లిగిన ప‌రాజ‌యానికి ప్ర‌తీకారం తీర్చుకున్న వైనం
  • ఈ విజ‌యంతో టేబుల్ టాప‌ర్‌గా బెంగ‌ళూరు
అరుణ్‌ జైట్లీ స్టేడియంలో నిన్న‌ ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)ను ఓడించిన‌ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు (ఆర్‌సీబీ) సొంత‌మైదానంలో ఇంత‌కుముందు ఆ జ‌ట్టు చేతిలో క‌లిగిన ప‌రాజ‌యానికి ప్ర‌తీకారం తీర్చుకుంది. డీసీ నిర్దేశించిన 163 పరుగుల ల‌క్ష్యాన్ని ఆర్‌సీబీ 18.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది.

కృనాల్‌ పాండ్యా ఆల్‌రౌండ్‌ (47 బంతుల్లో 73 నాటౌట్‌; 1/28) మెరుపులకు తోడు విరాట్‌ కోహ్లీ (47 బంతుల్లో 51) మరో హాఫ్ సెంచ‌రీతో మెరిశాడు. ఇక‌, మోస్తరు ఛేదనతో బ‌రిలోకి దిగిన బెంగ‌ళూరుకు ప్రారంభంలోనే భారీ ఎదురుదెబ్బ త‌గిలింది. 4 ఓవర్లు ముగిసేసరికి బెంగళూరు 3 వికెట్లు కోల్పోయి కేవ‌లం 26 ర‌న్స్ మాత్ర‌మే చేసింది. 

డీసీ కెప్టెన్ అక్షర్ ప‌టేట్‌... ఒకే ఓవర్లో బెతెల్‌ (12)తో పాటు పడిక్కల్‌ (0)ను పెవిలియ‌న్ పంపాడు. ఆ త‌ర్వాత‌ కరుణ్‌ మెరుపు త్రో తో ఆర్‌సీబీ సార‌థి రజత్ పాటీదార్‌ (6) రనౌట్‌ అయ్యాడు. ఈ క్రమంలో క్రీజులోకి వచ్చిన కృనాల్ పాండ్యా.. కోహ్లీతో కలిసి బెంగళూరు ఇన్నింగ్స్‌ను చ‌క్క‌దిద్దాడు. డీసీ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో 12 ఓవర్లకూ ఆర్‌సీబీ స్కోరు 78/3గానే ఉంది.

కానీ, ముకేశ్ 13వ‌ ఓవర్‌ నుంచి కృనాల్‌ గేర్‌ మార్చాడు. ఆ ఓవర్లో రెండు సిక్సర్లు బాదిన అతడు... కుల్దీప్‌ ఓవర్లోనూ ఓ సిక్స్‌ కొట్టాడు. అక్షర్‌ బౌలింగ్‌లో బౌండరీతో కృనాల్‌ అర్ధ శతకం పూర్తయింది. కోహ్లీ కూడా వరుసగా మూడో హాఫ్‌ సెంచరీ నమోదు చేశాడు. అయితే, బెంగళూరు విజయానికి 18 పరుగుల దూరంలో కోహ్లీ నిష్క్రమించినా కృనాల్‌, డేవిడ్‌ (19 నాటౌట్‌) లాంఛనాన్ని పూర్తి చేశారు.

టేబుల్ టాప‌ర్‌గా బెంగ‌ళూరు
ఈ విజ‌యంతో బెంగ‌ళూరు పాయింట్ల ప‌ట్టిక‌లో టాప్‌కి దూసుకెళ్లింది. ఇప్ప‌టివ‌ర‌కు ఆడిన 10 మ్యాచుల్లో 7 విజ‌యాల‌తో ఆర్‌సీబీ అగ్ర‌స్థానానికి ఎగ‌బాకింది. మ‌రోవైపు గుజ‌రాత్‌, ముంబ‌యి, ఢిల్లీ, పంజాబ్ త‌ర్వాతి స్థానాల్లో కొన‌సాగుతున్నాయి. ఐపీఎల్ 2025లో ప్ర‌త్య‌ర్థి వేదిక‌ల్లో ఆడిన ఆరు మ్యాచుల్లోనూ ఆర్‌సీబీ విజ‌యం సొంతం చేసుకోవ‌డం విశేషం. 




More Telugu News