భారత్‌తో ఉద్రిక్తతల నడుమ.. పాకిస్థాన్‌కు బ్యాడ్ న్యూస్!

  • పాకిస్థాన్‌లో కోటిమందికిపైగా ప్రజలు ఆకలితో అలమటిస్తారన్న ప్రపంచ బ్యాంకు నివేదిక
  • ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పాక్ తీవ్ర ఆహార కొరతను ఎదుర్కోబోతోందని హెచ్చరిక
  • పాక్ ఆర్థిక వృద్ధిరేటు 2.7 శాతానికి తగ్గింపు
  • ఈ ఆర్థిక సంవత్సరంలో 19 లక్షల మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి జారిపోవచ్చన్న వరల్డ్ బ్యాంకు
భారత్-పాకిస్థాన్ మధ్య ఉద్రిక్తతల నేపథ్యంలో పాకిస్థాన్‌కు మరో పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పటికే పేదరికంతో అల్లాడుతున్న ఆ దేశానికి ఇప్పుడు భారత్ నుంచి యుద్ధ భయం పట్టుకుంది. ఈ క్రమంలో తాజాగా ప్రపంచ బ్యాంకు మరో బ్యాడ్ న్యూస్ చెప్పింది. ప్రపంచ బ్యాంకు నివేదిక ప్రకారం.. పాకిస్థాన్‌లో కోటి మందికిపైగా ప్రజలు ఆకలితో అలమటించే పరిస్థితుల్లో ఉన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో పాక్ తీవ్ర ఆహార కొరతను ఎదుర్కొనే అవకాశముందని ప్రపంచ బ్యాంక్ నివేదిక హెచ్చరించింది. అలాగే, పేదరికం కూడా మరింత పెరిగే ప్రమాదం ఉందని పేర్కొంది.

ప్రపంచ బ్యాంక్ నివేదిక ప్రకారం.. పాకిస్థాన్ ఆర్థిక వృద్ధి అంచనాను 2.7 శాతానికి తగ్గించారు. దేశ ఆర్థిక విధానాలు, పెరుగుతున్న అప్పు స్థితిని దృష్టిలో పెట్టుకుని ఈ అంచనాను సవరించారు. అదే సమయంలో, ప్రధాని షెహబాజ్ షరీఫ్ నేతృత్వంలోని ప్రభుత్వం వార్షిక బడ్జెట్ లోటు లక్ష్యాన్ని చేరుకోలేకపోవచ్చని కూడా నివేదికలో హెచ్చరించారు. పాకిస్థాన్ అప్పు-జీడీపీ నిష్పత్తి మరింత పెరగనున్నట్టు తెలిపింది.

కోటిమంది ఆకలి పోరాటం
పాకిస్థాన్‌లో ప్రస్తుతం కోటిమంది ఆకలితో పోరాడుతున్నారు. పాక్‌లో పంటల ఉత్పత్తిపై ప్రతికూల ప్రభావం చూపే వాతావరణ పరిస్థితుల కారణంగా బియ్యం, మొక్కజొన్న వంటి ప్రధాన పంటల దిగుబడి భారీగా తగ్గే ప్రమాదం ఉందని ప్రపంచ బ్యాంక్ పేర్కొంది. దీని ఫలితంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న కోటి మందికి పైగా ప్రజలు తీవ్ర ఆహార సంక్షోభానికి గురై ఆకలితో అలమటించే అవకాశం ఉందని హెచ్చరించింది. జనాభా వృద్ధి రేటు సుమారు 2 శాతం ఉండటంతో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో సుమారు 19 లక్షల మంది ప్రజలు తీవ్ర పేదరికంలోకి జారిపోవచ్చని నివేదిక పేర్కొంది. మహిళలు, యువత కార్మిక విభాగంలో చాలా తక్కువ స్థాయిలో పాల్గొంటున్నారని కూడా నివేదిక వెలుగులోకి తెచ్చింది.

పహల్గామ్ ఉగ్రదాడి నేపథ్యంలో..
ప్రస్తుతం పాకిస్థాన్‌లో ఉపాధి-జనాభా నిష్పత్తి 49.7 శాతంగా ఉంది. పాకిస్థాన్‌ను గత దశాబ్ద కాలంగా వేధిస్తున్న ప్రధాన సమస్యలను ప్రపంచ బ్యాంకు నివేదిక గుర్తు చేసింది. ఆహార భద్రతా లోపం, పేదరికం, నిరుద్యోగం, గణనీయంగా తగ్గిన వాస్తవ వేతనాల గురించి, వ్యవసాయం, తయారీ రంగం, తక్కువ విలువ జోడించిన సేవలు వంటి రంగాలు ప్రతికూల వృద్ధిని ఎదుర్కొంటుండటంతో వాస్తవ వేతనాలు స్థిరంగా ఉండిపోయాయని తెలిపింది. పహల్గామ్ దాడి పర్యవసానాల నేపథ్యంలో ప్రపంచబ్యాంకు ఈ నివేదికను వెల్లడించింది.  


More Telugu News