గాయని ప్రవస్తి ఆరోపణలపై నిర్మాత ప్రవీణ స్పందన.. వీడియో విడుదల

  • షోలో దుస్తుల ఎంపిక పాటకు అనుగుణంగానే ఉంటుందన్న ప్రవీణ
  • కాస్ట్యూమర్ ఏమైనా అంటే వెంటనే తమ దృష్టికి తీసుకురావాల్సిందన్న ప్రవీణ
  • డ్రెస్సుల విషయంలో తాను ఎప్పుడూ ప్రత్యేకంగా ఇలా వేసుకో అని చెప్పలేదని స్పష్టీకరణ
వర్ధమాన గాయని ప్రవస్తి ఇటీవల చేసిన ఆరోపణలపై జ్ఞాపిక ఎంటర్‌టైన్‌మెంట్స్‌ అధినేత, నిర్మాత ప్రవీణ కడియాల స్పందించారు. ఈ అంశంపై పూర్తి స్పష్టతనిస్తూ ఆమె ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. షోలో దుస్తుల ఎంపిక కేవలం పాటకు అనుగుణంగానే ఉంటుందని, బాడీ షేమింగ్‌కు ఎప్పుడూ పాల్పడలేదని ఆమె స్పష్టం చేశారు.

షోలో గాయకులు ధరించే దుస్తుల ఎంపిక విధానం గురించి ప్రవీణ వివరిస్తూ, "సింగర్స్ ఎంపిక చేసుకున్న పాటకు తగ్గట్టుగానే కాస్ట్యూమ్స్‌ని డిజైన్‌ చేయిస్తుంటాం. ఎంపిక పూర్తిగా పాట మీదే ఆధారపడి ఉంటుంది. వ్యక్తిని బట్టి ఎప్పుడూ దుస్తులు రూపొందించలేదు" అని స్పష్టం చేశారు.

'మీ శరీరానికి ఏ డ్రెస్సూ సరిపోదు' అని కాస్ట్యూమర్‌ అన్నారని ప్రవస్తి చేసిన ఆరోపణపై ప్రవీణ స్పందిస్తూ, "అలా అనడం తప్పే. కానీ, ఆ విషయం వెంటనే నాకు గానీ, షో డైరెక్టర్‌కు గానీ చెప్పాల్సింది. దుస్తుల విషయంలో ఎప్పుడూ ప్రత్యేకంగా ఇలా వేసుకో, అలా వేసుకో అని చెప్పలేదు" అని తెలిపారు.

తనకు పాడలేని పాటలు ఇచ్చి, తమకు అనుకూలంగా ఉండే కంటెస్టెంట్లకు నచ్చిన పాటలు ఇచ్చేవారని ప్రవస్తి చేసిన ఆరోపణలపై కూడా ప్రవీణ స్పందించారు.

వాస్తవానికి, ప్రతి షెడ్యూల్‌కు ముందు క్రియేటివిటీ టీమ్‌ నాలుగు రకాల పాటలను ఎంపిక చేసి, వాటి వివరాలను కంటెస్టెంట్లకు పంపిస్తుందని తెలిపారు. ఛానల్‌కు ఏ పాటలపై హక్కులు ఉన్నాయో చూసుకుని, వాటిలోంచి ఆరు పాటలను ఎంచుకోవాలని వారికి సూచిస్తామని, వారు రిహార్సల్స్‌ పూర్తి చేసి, సిద్ధంగా ఉన్నామని చెప్పిన తర్వాతే షూటింగ్‌ ప్రారంభిస్తామని ఆమె వివరించారు.

షో నియమాల గురించి మాట్లాడుతూ, "జడ్జిమెంట్‌ను మేం గౌరవిస్తాం అనే విషయం మీరు సంతకం చేసిన ఒప్పంద పత్రంలో కూడా స్పష్టంగా ఉంటుంది. దాన్ని మీరు పూర్తిగా చదివి ఉంటే బాగుండేది" అని ప్రవీణ పేర్కొన్నారు. ఇలాంటి అపోహలన్నీ పక్కన పెట్టి, మీరు జీవితంలో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకుంటున్నానంటూ ప్రవస్తికి శుభాకాంక్షలు తెలిపారు.


More Telugu News