సీఎం చంద్రబాబును గుండెల్లో పెట్టుకొని పూజిస్తాను: ఎమ్మెల్యే వెనిగండ్ల రాము

  • అట్లాంటా స్టేట్ ఎన్నారై టీడీపీ ఆధ్వర్యంలో ఘనంగా సీబీఎన్‌ 75వ జ‌న్మ‌దిన వేడుకలు
  • ముఖ్యఅతిథిగా పాల్గొని కేక్ కట్ చేసిన ఎమ్మెల్యే రాము
  • ప్రజల మంచి కోసం కష్టపడి పనిచేయడమే చంద్రబాబు బలమ‌ని వ్యాఖ్య‌
  • ప్రవాసాంధ్రులు చంద్రబాబు పీ4లో భాగస్వాములు కావాల‌ని పిలుపు
  • కమ్మింగ్ ఎన్‌టీఆర్ స్టాట్యూ 2450 మౌంటైన్ రోడ్ లో బర్త్‌డే వేడుక‌లు
  • వేడుకల్లో ప్రవాసాంధ్రులను ఉద్దేశించి మాట్లాడిన ఎమ్మెల్యే రాము
సీఎం చంద్రబాబు పుట్టినరోజు ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఎంతో ప్రాముఖ్యమైన రోజు. గ‌తేడాది పర్యటనలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన చోటే చంద్రబాబు పుట్టినరోజు వేడుకల్లో పాల్గొనడం సంతోషంగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అవసరాలను తీర్చడానికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా ముందు నిలబడుతూ... రాష్ట్ర తలరాతను మార్చేందుకు అహర్నిశలు శ్రమిస్తున్న మహోన్నత వ్యక్తి సీఎం చంద్రబాబు అని గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము అన్నారు. 

ఖండాంతరాలు దాటి పుట్టినరోజు వేడుకలు జరుగుతుండడమే... చంద్రబాబు గొప్పతనానికి నిదర్శనమ‌ని పేర్కొన్నారు. సమకాలీన రాజకీయాల్లో చంద్రబాబుకు సాటి వచ్చే వ్యక్తి దేశంలో మోదీ తప్ప మరొకరు ఉండర‌ని కొనియాడారు. తెలుగు ప్రజలందరూ రుణపడి ఉండాల్సిన వ్యక్తి చంద్రబాబు అని అన్నారు.

మోడ్రన్ హైదరాబాద్ ను ఎలా అభివృద్ధి చేశారో.... ప్రపంచ స్థాయిలో అమరావతి లాంటి గొప్ప నగర నిర్మాణాన్ని ముందుకు తీసుకెళుతున్నార‌ని తెలిపారు. మనం చేసే పనులు భవిష్యత్తు తరాలకు ఎలా ఉపయోగపడతాయా అని సీఎం నిరంతరం ఆలోచిస్తుంటార‌ని ఎమ్మెల్యే అన్నారు. ఇంకా కొందరిని జైలుకు పంపడం లేదేంటి అని  మనం ఆలోచిస్తున్నాం. కానీ, ప్రజలకు ఏం మంచి చేయాలా అని చంద్రబాబు నిరంతరం ఆలోచిస్తుంటార‌ని చెప్పారు.

చట్ట ప్రకారంగా వ్యవహరించాలనేదే చంద్రబాబు ఆలోచన అని, ఐదేళ్లపాటు పనికిరాని వ్యక్తులు చంద్రబాబు గురించి నీచంగా మాట్లాడార‌ని ఎమ్మెల్యే దుయ్య‌బ‌ట్టారు. నేడు అధికారం ఉంది కదా అని వాళ్ల‌ని టార్గెట్ చేయకుండా... ప్రజల కోసం కష్టపడుతున్నార‌ని అన్నారు. గత ప్రభుత్వం తనకు చేసిన అన్యాయాలను దిగమింగి... రాజధాని నిర్మాణం, పోలవరం పూర్తి చేయడం ఇలా ప్రజలకు ఏం కావాలో వాటి కోసమే ఆయన కష్టపడుతున్నారని ఎమ్మెల్యే పేర్కొన్నారు.

ప్రజల మంచి కోసం కష్టపడి పనిచేయడమే చంద్రబాబు బలం అని అన్నారు. ఎన్టీఆర్ తనకు ఆరాధ్య దైవం అయితే, చంద్రబాబును గుండెల్లో పెట్టుకొని పూజిస్తాన‌న్నారు. ప్రపంచంలో ఉన్న తెలుగువారి అభివృద్ధిని చూసి, చంద్రబాబు ఎంతో గర్వంగా చెబుతార‌న్నారు. చంద్రబాబు 2047 విజన్ లో మనందరం భాగస్వామ్యం అవుదామ‌ని ఈ సంద‌ర్భంగా ఎమ్మెల్యే రాము పిలుపునిచ్చారు. చంద్రబాబు ఆలోచనలే రేపటి భావితరాల అభ్యున్నతికి వారదులుగా మారుతున్నాయ‌న్నారు.

చంద్రబాబు విజన్ నుంచి పుట్టుకొచ్చిన ఆలోచనలు నేడు దేశం మొత్తం అమలు చేస్తున్నార‌ని తెలిపారు. చంద్రబాబు వందేళ్లపాటు ఇదే ఉత్సాహంతో పనిచేసి, తెలుగు వారందరిని ముందుకు తీసుకెళ్లాల‌ని ఆయ‌న ఆకాంక్షించారు. ఎన్నారై చేయాలనుకున్న మంచి పనులు త‌న‌విగా భావించి, వాటిని ముందుకు తీసుకెళ‌తాన‌ని అన్నారు. ప్రవాసాంధ్రులు చంద్రబాబు పీ4 కార్య‌క్ర‌మంలో భాగస్వాములు కావాల‌ని పిలుపునిచ్చారు. ప్రజల మంచి కోసం చంద్రబాబుతో కలిసి పని చేయాల‌ని ఎమ్మెల్యే వెనిగండ్ల రాము చెప్పుకొచ్చారు.



More Telugu News