ఆత్మహత్య చేసుకుంటానని ఏఐజీ ఆసుపత్రి మాజీ ఉద్యోగిని హాల్ చల్ .. చివరికి ఏమి జరిగిందంటే..?

  • ఉద్యోగం నుంచి తొలగించారంటూ ఆసుపత్రి భవనంపై ఎక్కి బెదిరింపులకు దిగిన మహిళా ఉద్యోగిని శివలీల
  • బంజారాహిల్స్ ఏఐజీ ఆసుపత్రి వద్ద చోటుచేసుకున్న ఘటన 
  • శివలీలను అదుపులోకి తీసుకుని విచారించి పంపిన పోలీసులు  
ఏఐజీ ఆసుపత్రిలో పనిచేసిన ఒక మాజీ మహిళా ఉద్యోగిని, తనను ఉద్యోగం నుండి అకారణంగా తొలగించారని ఆరోపిస్తూ, ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తూ ఆసుపత్రి భవనం ఎక్కి హల్చల్ చేసింది.  బంజారాహిల్స్‌లో శనివారం ఒక సంఘటన చోటుచేసుకుంది. శివలీల అనే ఆ మహిళ గతంలో ఏఐజీ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ హౌస్ కీపింగ్ సూపర్‌వైజర్‌గా పనిచేసింది.

సహచరులతో తాను ఆత్మహత్య చేసుకుంటానని చెప్పి ఆమె నిర్మాణంలో ఉన్న ఏఐజీ ఆసుపత్రి భవనంపైకి ఎక్కింది. యాజమాన్యం తనకు భరోసా కల్పిస్తేనే కిందకు దిగుతానని, లేకపోతే కిందకు దూకి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించింది. ఈ విషయం తెలుసుకున్న భవనం సిబ్బంది, స్థానికులు పెద్ద సంఖ్యలో అక్కడికి చేరుకోవడంతో వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది.

సమాచారం అందుకున్న బంజారాహిల్స్ ఎస్ఐ రమేశ్, అగ్నిమాపక శాఖ అధికారులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని ఆమెకు నచ్చజెప్పి వివరాలు తెలుసుకున్నారు. తనను అకస్మాత్తుగా విధుల నుంచి తొలగించడంతో పాటు, సహచర ఉద్యోగి రమేశ్ తనను కించపరుస్తూ వేధింపులకు గురి చేశాడని ఆమె అధికారులకు తెలిపింది. దాదాపు మూడు గంటల పాటు కొనసాగిన ఈ హైడ్రామా అనంతరం పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం, ఆసుపత్రి ఉద్యోగి రమేశ్‌తో పాటు ఆమెను పోలీస్ స్టేషన్‌కు తీసుకువెళ్లి రాత్రి వరకు విచారించి పంపినట్లు తెలిసింది. అయితే శివలీల తమకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదని పోలీసులు మీడియాకు తెలిపారు. 


More Telugu News