అండర్ వరల్డ్ డాన్ కొడుకుపై హత్యాయత్నం

  • కర్ణాటకలోని బిడదిలో రిక్కీ రాయ్ కారుపై దుండగుల ఫైరింగ్
  • వెనుక సీట్లో ఉండగా మూడు రౌండ్ల కాల్పులు
  • ముక్కు, చేతికి బుల్లెట్ గాయాలు.. ఆసుపత్రికి తరలించిన పోలీసులు
  • ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసు ఉన్నతాధికారులు
కర్ణాటకలో సంచలనం సృష్టించిన మాజీ అండర్‌వరల్డ్ డాన్ ముత్తప్ప రాయ్ కుమారుడు రిక్కీ రాయ్‌పై శుక్రవారం పట్టపగలే కాల్పుల ఘటన చోటుచేసుకుంది. బిడదిలోని తన నివాసం నుంచి బెంగళూరుకు బయలుదేరిన సమయంలో ఈ దాడి జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

వివరాల్లోకి వెళితే, శుక్రవారం మధ్యాహ్నం సుమారు 1:30 గంటల సమయంలో రిక్కీ రాయ్ తన ఫార్చ్యూనర్ ఎస్‌యూవీ వాహనంలో డ్రైవర్, గన్‌మెన్‌తో కలిసి బెంగళూరుకు బయలుదేరారు. సాధారణంగా తానే స్వయంగా కారు నడిపే రిక్కీ రాయ్, ఈసారి మాత్రం వెనుక సీట్లో కూర్చున్నారు. ఆయన వాహనం బిడదిలోని ఇంటి కాంపౌండ్ దాటుతున్న క్రమంలో గుర్తుతెలియని దుండగులు ఒక్కసారిగా వాహనంపై కాల్పులకు తెగబడ్డారు. దుండగులు మూడు రౌండ్లు కాల్పులు జరిపినట్లు సమాచారం. 

ఈ కాల్పుల్లో రిక్కీ రాయ్ ముక్కుకు, చేతికి బుల్లెట్ గాయాలయ్యాయి. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది ఆయన్ను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని మరో ఆసుపత్రికి రిక్కీ రాయ్‌ను తరలించినట్లు తెలుస్తోంది.

కాల్పుల ఘటన గురించి తెలియగానే రామనగర ఎస్పీ శ్రీనివాస్ గౌడ, డీఎస్పీ శ్రీనివాస్ ఇతర పోలీసు ఉన్నతాధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. దుండగులు ఎవరు? కాల్పులకు కారణం ఏంటి? అనే కోణాల్లో పోలీసులు దర్యాప్తు ముమ్మరం చేశారు. దాడి జరిగినప్పుడు రిక్కీ రాయ్ వెనుక సీట్లో కూర్చోవడం, సాధారణంగా ఆయనే డ్రైవింగ్ చేస్తారన్న సమాచారం నేపథ్యంలో పోలీసులు అన్ని కోణాల్లోనూ విచారణ జరుపుతున్నారు.


More Telugu News