మల్‌రెడ్డి రంగారెడ్డి దమ్ముంటే రాజీనామా చేయాలి: మంచిరెడ్డి కిషన్ రెడ్డి సవాల్
- మంత్రి పదవి రాకుంటే రాజీనామా చేస్తానని గాలిమాటలు చెప్పడం కాదన్న కిషన్ రెడ్డి
- రంగారెడ్డికి పదవి ధ్యాస తప్ప అభివృద్ధి ఆలోచన లేదని వ్యాఖ్య
- నియోజకవర్గ అభివృద్ధికి ఒక్క రూపాయి తీసుకు రాలేదన్న కిషన్ రెడ్డి
ఇబ్రహీంపట్నం మున్సిపాలిటీలోని శేరిగూడ సీకే కన్వెన్షన్ హాలులో జరిగిన పార్టీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, మంత్రి పదవి కోసం ఏడాదిన్నరగా ఢిల్లీ పెద్దల చుట్టూ తిరుగుతూ సమయం వృథా చేస్తున్నారని విమర్శించారు. ప్రజా సమస్యలు ఆయనకు పట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇబ్రహీంపట్నం నియోజకవర్గంలో బీఆర్ఎస్ హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులు తప్ప కాంగ్రెస్ వచ్చాక చేసింది ఏమీ లేదని అన్నారు.
నియోజకవర్గ అభివృద్ధి కోసం ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి కూడా తీసుకురాలేని మల్‌రెడ్డి రంగారెడ్డి లాంటి వ్యక్తిని ఎమ్మెల్యేగా గెలిపించుకోవడం నియోజకవర్గ ప్రజల దురదృష్టమని అన్నారు. మల్‌రెడ్డి రంగారెడ్డి అభివృద్ధిని పక్కన పెట్టి ఢిల్లీ చుట్టూ, గాంధీ భవన్ చుట్టూ తిరుగుతున్నారని దుయ్యబట్టారు. నియోజకవర్గంలోని సమస్యలు పరిష్కరించాలనే కనీస ఆలోచన కూడా ఆయనకు లేదని అన్నారు.