స్కూల్ వాటర్ ట్యాంకులో విషం కలిపిన దుండగులు.. ఎక్కడంటే?
- ఆదిలాబాద్ జిల్లాలోని ఇచ్చోడ మండలంలో ఘోరం
- మధ్యాహ్న భోజన సామాగ్రిపైనా చల్లిన వైనం
- సిబ్బంది అప్రమత్తతో తప్పిన ముప్పు.. పోలీసులకు హెచ్ఎం ఫిర్యాదు
శనివారం, ఆదివారం సెలవులు కావడంతో సిబ్బంది పాఠశాలలోని వంటగదికి తాళం వేసి ఇంటికి వెళ్లారు. సోమవారం ఉదయం స్కూలుకు వచ్చిన సిబ్బంది.. మధ్యాహ్న భోజనం కోసం వంట ఏర్పాట్లు ప్రారంభించారు. పాత్రలను శుభ్రం చేసే సమయంలో నీటి నుంచి నురగలు, దుర్వాసన రావడంతో అప్రమత్తమయ్యారు. చుట్టుపక్కల పరిశీలించగా.. వాటర్ ట్యాంక్ సమీపంలో పురుగుల మందు డబ్బా కనిపించిందని సిబ్బంది చెప్పారు.
తాగునీటి ట్యాంకులో పురుగుల మందు కలిపినట్లు గుర్తించారు. దీంతో విద్యార్థులు తాగునీటి కుళాయిల వైపు వెళ్లకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. మధ్యాహ్న భోజనం వండలేదు. ఈ ఘటనతో స్కూలుతో పాటు గ్రామంలోనూ భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై స్కూలు హెడ్ మాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. వాటర్ ట్యాంక్ లో పురుగుమందు కలిపిన దుండగులను గుర్తించేందుకు దర్యాప్తు ప్రారంభించారు.