ఇది బౌలర్ల మ్యాచ్... చహల్ మ్యాజిక్, యన్సెన్ కీలక స్పెల్... పంజాబ్ సంచలన విజయం

  • ఛండీగఢ్ లో మ్యాచ్
  • 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక చతికిలపడిన కోల్ కతా
  • 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్
  • 4 వికెట్లతో మ్యాచ్ ను మలుపు తిప్పిన చహల్ 
  • చివర్లో కీలక వికెట్లు తీసిన యన్సెన్
చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ మహారాజా యదవీంద్ర సింగ్ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఐపీఎల్ 2025 సీజన్ 31వ మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ సత్తా చాటింది. మంగళవారం జరిగిన ఈ పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్‌పై 16 పరుగుల తేడాతో పంజాబ్ కింగ్స్ విజయం సాధించింది. బౌలర్లు ఆధిపత్యం చెలాయించిన ఈ తక్కువ స్కోర్ల మ్యాచ్‌లో పంజాబ్ అద్భుతమైన పోరాటపటిమ కనబరిచింది. 

ముఖ్యంగా లెగ్  స్పిన్నర్ యుజువేంద్ర చహల్ తన  స్పిన్ మ్యాజిక్ తో మ్యాచ్ ను మలుపుతిప్పగా, చివర్లో పేసర్ మార్కో యన్సెన్ కీలక స్పెల్ తో పంజాబ్ విజయాన్ని ఖరారు చేశాడు. 112 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక కోల్ కతా నైట్ రైడర్స్ 15.1 ఓవర్లలో 95 పరుగులకే ఆలౌట్ అయింది.

ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పంజాబ్ 15.3 ఓవర్లలో 111 పరుగులకే ఆలౌట్ అయింది. కేకేఆర్ బౌలర్లలో హర్షిత్ రాణా 3 వికెట్లు పడగొట్టగా, వరుణ్ చక్రవర్తి, నరైన్ చెరో 2 వికెట్లు, వైభవ్ అరోరా, నోర్జే తలో వికెట్ తీశారు.

స్వల్ప లక్ష్య ఛేదనలో కోల్‌కతా నైట్ రైడర్స్ ఆదిలోనే తడబడింది. ఓపెనర్లు క్వింటన్ డి కాక్ (2), సునీల్ నరైన్ (5) విఫలమయ్యారు. వీరిద్దరినీ వరుస ఓవర్లలో మార్కో జాన్సెన్, జేవియర్ బార్ట్‌లెట్ పెవిలియన్ పంపారు. కెప్టెన్ అజింక్యా రహానే (17 బంతుల్లో 17; 1 ఫోర్, 1 సిక్స్), అంగ్‌క్రిష్ రఘువంశీ (28 బంతుల్లో 37; 5 ఫోర్లు, 1 సిక్స్) కాసేపు వికెట్ల పతనాన్ని అడ్డుకొని ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే ప్రయత్నం చేశారు. ముఖ్యంగా రఘువంశీ దూకుడుగా ఆడాడు. అయితే, జట్టు స్కోరు 62 వద్ద రహానేను, 72 పరుగుల వద్ద రఘువంశీని చాహల్ అవుట్ చేయడంతో కేకేఆర్ మళ్లీ కష్టాల్లో పడింది. 

వెంకటేశ్ అయ్యర్ (7), రింకూ సింగ్ (2), రమణ్‌దీప్ సింగ్ (0)లను స్వల్ప వ్యవధిలో మ్యాక్స్‌వెల్, చాహల్ అవుట్ చేయడంతో కేకేఆర్ ఓటమి ఖాయమైంది. చివర్లో ఆండ్రీ రస్సెల్ (11 బంతుల్లో 17; 1 ఫోర్, 2 సిక్సులు) మెరుపులు మెరిపించినా, మార్కో జాన్సెన్ అతడిని బౌల్డ్ చేయడంతో కేకేఆర్ ఇన్నింగ్స్‌కు తెరపడింది. చివరికి కోల్‌కతా 15.1 ఓవర్లలో 95 పరుగులకే కుప్పకూలింది. 

పంజాబ్ బౌలర్లలో యుజ్వేంద్ర చాహల్ 4 వికెట్లతో చెలరేగగా, మార్కో జాన్సెన్ 3 వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్, గ్లెన్ మ్యాక్స్‌వెల్, జేవియర్ బార్ట్‌లెట్ తలో వికెట్ తీసి పంజాబ్ విజయంలో కీలక పాత్ర పోషించారు.


More Telugu News