బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్లొద్దు.. నా గ‌న్‌మ్యాన్ అలా చేసే కుటుంబం మొత్తాన్ని చంపేశాడు: హ‌రీశ్‌రావు

    
బెట్టింగ్ యాప్‌ల మోజులో ప‌డి కొంద‌రు ప్రాణాలు పోగొట్టుకుంటున్న ఘ‌ట‌న‌లు త‌ర‌చూ వెలుగుచూస్తున్నాయి. ఆన్‌లైన్ బెట్టింగ్‌ల కోసం అప్పులు చేసి, వాటిని తీర్చే దారిలేక చాలా మంది ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నారు. ఇదే విష‌య‌మై మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత‌ హరీశ్‌ రావు తాజాగా యువ‌త‌ను హెచ్చ‌రించారు. 

ఈ సంద‌ర్భంగా త‌న‌ గన్‌మ్యాన్ ఘాతుకాన్ని ఆయ‌న బ‌య‌ట‌పెట్టారు. త‌న వ‌ద్ద గ‌న్‌మ్యాన్‌గా ప‌నిచేసిన ఓ వ్య‌క్తి ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌లలో చాలా డబ్బు పోగొట్టుకున్నాడ‌ట‌. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయాడు. వాటిని తీర్చేందుకు దారిలేక భార్యతో పాటు 5, 7 ఏళ్ల వ‌య‌సు ఉన్న ఇద్ద‌రు పిల్లలను తుపాకీతో కాల్చి చంపాడు. ఆ త‌ర్వాత అదే గ‌న్‌తో తాను కాల్చుకుని బ‌ల‌వ‌న్మ‌ర‌ణానికి పాల్ప‌డ్డాడ‌ని హరీశ్‌ రావు పేర్కొన్నారు. 

క‌నుక‌ బెట్టింగ్ యాప్‌ల జోలికి వెళ్లొద్ద‌ని హెచ్చరించారు. ఏ షార్ట్‌కట్ మ‌న‌కు డబ్బు ఇవ్వద‌ని ఆయన అన్నారు. బెట్టింగ్ యాప్ నిర్వాహ‌కులు వారు డబ్బులు సంపాదించుకోవ‌డానికి వాటిని తీసుకొచ్చారు త‌ప్పితే.. మ‌న‌ల్ని గెలిపించి ల‌క్షాధికారులు చేయ‌డానికి కాద‌ని మాజీ మంత్రి తెలిపారు. అందుకే యువ‌త ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్‌ల‌కు ఎంత దూరం ఉంటే అంత మంచిద‌ని ఆయన సూచించారు. 




More Telugu News