అమెరికాలో తెలుగు విద్యార్థులకు తృటిలో తప్పిన ప్రమాదం

  • బర్మింగ్‌హామ్‌లో అగ్నిప్రమాదం
  • సురక్షితంగా బయటపడ్డ 10 మంది తెలుగు విద్యార్థులు
  • ఇద్దరు విద్యార్థులకు గాయాలు, ఐసీయూలో చికిత్స
  • అపార్ట్‌మెంట్లు పూర్తిగా దగ్ధం.
అమెరికాలోని బర్మింగ్‌హామ్ నగరంలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కెల్లామ్ స్ట్రీట్‌లోని అపార్ట్‌మెంట్‌లో సంభవించిన ఈ ప్రమాదం నుంచి పది మంది తెలుగు విద్యార్థులు తృటిలో ప్రాణాలతో బయటపడ్డారు. శనివారం సాయంత్రం 6:20 గంటల సమయంలో జరిగిన ఈ ప్రమాదం స్థానికంగా కలకలం రేపింది.

అపార్ట్‌మెంట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో దట్టమైన పొగలు వ్యాపించాయి. దీంతో ఊపిరాడక విద్యార్థులు భయంతో కేకలు వేశారు. అగ్నిమాపక సిబ్బంది వెంటనే స్పందించి సహాయక చర్యలు చేపట్టారు. మంటలను అదుపులోకి తీసుకువచ్చి, అపార్ట్‌మెంట్‌లో చిక్కుకున్న విద్యార్థులను సురక్షితంగా బయటకు తీసుకువచ్చారు.

ఈ ప్రమాదంలో ఇద్దరు విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని వెంటనే ఆసుపత్రికి తరలించి ఐసీయూలో చికిత్స అందిస్తున్నారు. మిగిలిన విద్యార్థులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారందరూ ప్రస్తుతం సురక్షితంగా ఉన్నారు.

బాధితులంతా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు. వీరంతా అలబామా విశ్వవిద్యాలయంలో ఉన్నత విద్యను అభ్యసిస్తున్నారు. ప్రమాదం జరిగిన సమయంలో మంటలను ఆర్పేందుకు ప్రయత్నించామని, కానీ మంటలు క్షణాల్లో వ్యాపించడంతో భయంతో బయటకు పరుగులు తీశామని విద్యార్థులు తెలిపారు. వెనుక ద్వారం ద్వారా బయటకు రావడంతో ప్రాణాలతో బయటపడ్డామని, ఇది తమకు పునర్జన్మ అని వారు పేర్కొన్నారు.

అగ్నిప్రమాదం కారణంగా అపార్ట్‌మెంట్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. విద్యార్థులు నిలువ నీడలేకుండా నిరాశ్రయులయ్యారు. స్థానిక తెలుగు సంఘాలు, విశ్వవిద్యాలయ అధికారులు విద్యార్థులకు సహాయం అందించేందుకు ముందుకు వచ్చారు. వారికి పునరావాసం కల్పించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. 


More Telugu News