విడదల రజనిపై ఫిర్యాదు చేసిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు

  • రజని అక్రమాలను ప్రశ్నించినందుకు తనపై దాడి చేశారన్న రావు సుబ్రహ్మణ్యం
  • తన కారుని, ఇంట్లో ఫర్నిచర్ ని ధ్వంసం చేశారని ఆవేదన
  • తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరిన సుబ్రహ్మణ్యం
వైసీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజనికి ఇబ్బందులు మరింత పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. శ్రీలక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యాజమాన్యాన్ని బెదిరించి వారి నుంచి రూ. 2.20 కోట్లను అక్రమంగా వసూలు చేశారనే వ్యవహారంలో ఇప్పటికే ఆమెపై కేసు నమోదయింది. ఆమెతో పాటు ఐపీఎస్ అధికారి పల్లె జాషువా, రజని మరిది విడదల గోపి, ఆమె పీఏ దొడ్డ రామకృష్ణలపై కూడా కేసు నమోదు చేశారు. 

మరోవైపు, తాజాగా విడదల రజని, ఆమె మరిది విడదల గోపిపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు అందింది. చిలకలూరిపేటకి చెందిన నవతరం పార్టీ జాతీయ అధ్యక్షుడు రావు సుబ్రహ్మణ్యం వీరిపై ఎస్పీకి ఫిర్యాదు చేశారు. 2022 ఏప్రిల్ లో రజని అక్రమాలను ప్రశ్నించినందుకు తన ఇంటిపై దాడి చేయించారని ఫిర్యాదులో ఆయన పేర్కొన్నారు. దాదాపు వంద మంది వచ్చి తనపై దాడి చేశారని... తన కారుని, ఇంట్లో ఫర్నిచర్ ని ధ్వంసం చేశారని తెలిపారు. మూడు రోజుల పాటు విధ్వంసం సృష్టించారని... తనను, తన కుటుంబ సభ్యులను చిత్రహింసలకు గురి చేశారని చెప్పారు. అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని... నామమాత్రంగా కేసు నమోదు చేశారని తెలిపారు. రజని, గోపి పేర్లను ఎఫ్ఐఆర్ లో చేర్చి తనకు న్యాయం చేయాలని ఎస్పీని కోరారు.


More Telugu News