ఓ వ్యాపారి ఇంట్లో దోపిడీకి మరో వ్యాపారి పన్నాగం.. చిత్తూరు కాల్పుల ఘటనలో భారీ ట్విస్ట్
- కర్ణాటక దోపిడీ ముఠాతో డీల్.. తుపాకులతో రంగంలోకి దిగిన గ్యాంగ్
- దొంగల రాకతో అప్రమత్తమై పోలీసులకు సమాచారం ఇచ్చిన వ్యాపారి
- ఇంటిని చుట్టుముట్టిన పోలీసులు.. రెండున్నర గంటల ఆపరేషన్
గాంధీరోడ్డులోని లక్ష్మీ సినిమా హాల్ సమీపంలో ఉన్న పుష్ప కిడ్స్ వరల్డ్ యజమాని చంద్రశేఖర్ ఇంట్లోకి బుధవారం ఉదయం ఓ దొంగల ముఠా చొరబడింది. ఇంట్లోకి వచ్చీరావడంతోనే గాలిలోకి కాల్పులు జరిపి చంద్రశేఖర్ కుటుంబ సభ్యులను బెదిరించింది. దోపిడీ ముఠా ఇల్లు దోచుకునే ప్రయత్నంలో ఉండగా చంద్రశేఖర్ పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు ఇంటిని చుట్టుముట్టి ముఠాలోని ఐదుగురు దొంగలను అదుపులోకి తీసుకున్నారు. దొంగల నుంచి తుపాకులు, రబ్బర్ బుల్లెట్లను స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు దొంగలు పారిపోయారని, వారి కోసం గాలిస్తున్నామని పోలీసులు చెప్పారు. ప్రాథమిక విచారణలో స్థానికంగా నివసించే ఎస్ఎల్వీ ఫర్నీచర్ యజమాని ఈ దోపిడీకి ప్లాన్ చేశాడని, పథకం ప్రకారం కర్ణాటక ముఠాను రంగంలోకి దించాడని తెలిసిందని పోలీసులు వివరించారు. విచారణలో పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని చెప్పారు.