పానీపూరి తినడానికి సబ్‌స్క్రిప్షన్.. రూ.99,000 చెల్లిస్తే జీవితాంతం తినొచ్చట!

  • పానీపూరీ ప్రియులకు నాగ్‌పూర్ వ్యాపారి ఆఫర్
  • ఒకే దఫాలో 40 పానీపూరీలు తింటే రూ.1 చెల్లిస్తే సరిపోతుంది
  • లాడ్లీ బెహెన్ యోజన కింద రూ.60 చెల్లించి మహిళలు ఎన్ని పానీపూరీలైనా తినవచ్చు
ఓటీటీ లాంటి వాటికి సబ్‌స్క్రిప్షన్ మనకు తెలిసిందే. కొన్ని హోటళ్లలో నెలకు లేదా ఏడాదికి ఒకేసారి బిల్లు చెల్లించి తినవచ్చు. కానీ మహారాష్ట్రలోని నాగ్‌పూర్‌కు చెందిన ఒక పానీపూరీ వ్యాపారి కూడా ఇలాంటి సరికొత్త ఆలోచన చేశాడు. పానీపూరీ ప్రియులను ఆకర్షించేందుకు వ్యాపారి విజయ్ అద్భుతమైన ఆఫర్ ప్రకటించాడు. పానీపూరీ ప్రియులు ప్రతిసారి డబ్బులు చెల్లించాల్సిన అవసరం లేదని, నెలవారీ, సంవత్సరం, జీవితాంతం పానీపూరీ తినేలా ఒకేసారి చెల్లించేలా సబ్‌స్క్రిప్షన్ తీసుకువచ్చాడు.

జీవితాంతం పానీపూరీ ఉచితంగా తినడానికి రూ.99,000 చెల్లించాలని ఆఫర్ ప్రకటించాడు. లైఫ్ టైమ్ సబ్‌స్క్రిప్షన్ తీసుకున్నవారు ఎప్పుడంటే అప్పుడు, ఎన్ని పానీపూరీలైనా తినవచ్చు. ఈ ఆఫర్‌ను ఉపయోగించుకోవడం కోసం ఇప్పటికే ఇద్దరు డబ్బులు చెల్లించారు. జీవితాంతం ఆఫర్లే కాకుండా మరిన్ని ఆఫర్లు కూడా ప్రకటించాడు. ఒకే దఫాలో 151 పానీపూరీలు తింటే రూ.21,000 రివార్డ్ ఇస్తానని ప్రకటించాడు.

'మహాకుంభ్' ఆఫర్... ఈ ఆఫర్ కింద ఒకే దఫాలో ఒక వ్యక్తి 40 పానీపూరీలు తినగలిగితే రూ.1 చెల్లించవచ్చు. మరో ఆఫర్ 'లాడ్లీ బెహెన్ యోజన' కింద పానీపూరీ తినడానికి వచ్చిన మహిళలు రూ.60 చెల్లించి ఎన్నైనా తినవచ్చు. ఇక రూ.195 చెల్లించి నెలకు అన్‌లిమిటెడ్ పానీపూరీలు తినొచ్చు.


More Telugu News