ఆ దేశంలో బీర్ టిన్ల‌పై గాంధీ ఫొటోలు, సంత‌కం.. కంపెనీపై నెట్టింట‌ భార‌తీయుల ఆగ్ర‌హం!

  • మ‌హాత్మాగాంధీకి ర‌ష్యాలో ఘోర అవ‌మానం
  • హాజీ ఐపీఏ పేరిట‌ బీర్ టిన్ల‌పై గాంధీ ఫొటో, పేరుతో విక్ర‌యాలు
  • ర‌ష్యాకు చెందిన రివోర్ట్స్ అనే కంపెనీ నిర్వాకం
  • నెట్టింట బీర్ టిన్ల ఫొటోలు, వీడియోలు వైర‌ల్‌
మాంసం, మ‌ద్యానికి దూరంగా ఉండాల‌ని బోధించిన మ‌న జాతిపిత మ‌హాత్మాగాంధీకి ర‌ష్యాలో ఘోర అవ‌మానం జ‌రిగింది. అక్క‌డ ఓ బీర్లు త‌యారు చేసే కంపెనీ ఏకంగా బీర్‌ టిన్ల‌పై గాంధీ ఫొటోలు ముద్రించి విక్ర‌యిస్తోంది. అది కూడా మ‌హాత్ముడి పేరు, సంత‌కంతో స‌హా ముద్రించి బీర్ టిన్ల‌ను స‌ద‌రు ర‌ష్య‌న్ బేవ‌రేజ్ సంస్థ అమ్ముతోంది.  

ర‌ష్యాకు చెందిన రివోర్ట్స్ అనే కంపెనీ హాజీ ఐపీఏ పేరుతో ఇలా బీర్ టిన్ల‌ను విక్ర‌యిస్తోంది. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు ప్ర‌స్తుతం సామాజిక మాధ్య‌మాల్లో వైర‌ల్ అవుతున్నాయి. 

కాగా, రివోర్ట్స్ కంపెనీ కేవ‌లం గాంధీజీ ఫొటోల‌తోనే కాకుండా నెల్స‌న్ మండేలా, మార్టిన్ లూథ‌ర్ కింగ్‌, మ‌ద‌ర్ థెరిస్సా వంటి ప్ర‌ముఖ నాయ‌కుల పేర్లు, ఫొటోల‌తో బీర్లు త‌యారు చేసి, విక్ర‌యిస్తున్న‌ట్లు స‌మాచారం. దీంతో స‌ద‌రు బీర్ల త‌యారీ కంపెనీపై భార‌తీయులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.    

మ‌ద్యపానానికి దూరంగా ఉండాల‌ని జీవితాంతం పోరాడిన మ‌హానీయుడి ఫొటోల‌ను బీర్ల విక్ర‌యాల కోసం ఉప‌యోగించ‌డం ఏంట‌ని ఫైర్ అవుతున్నారు. ఇక ఈ వ్య‌వ‌హారం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ కావ‌డంతో ఒడిశా మాజీ సీఎం నందిని స‌త్ప‌తి మ‌న‌వ‌డు సువ‌ర్ణో స‌త్ప‌తి ఎక్స్ వేదిక‌గా ప్ర‌ధాని మోదీ దృష్టికి తీసుకెళ్లిన‌ట్లు స‌మాచారం. 


More Telugu News