చాంపియన్స్ ట్రోఫీ‌: భారత జెర్సీపై కొత్త వివాదం.. ‘పాక్’ పేరుపై తేల్చిచెప్పేసిన బీసీసీఐ

  • చాంపియన్స్ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యం
  • పాల్గొనే జట్లు ‘పాక్’ పేరును కిట్లపై ముద్రించడం తప్పనిసరి
  • తాము ఆ పనిచేయబోమని తేల్చి చెప్పిన బీసీసీఐ
  • భారత్ ఆడే మ్యాచ్‌లు పాక్‌లో జరగడం లేదన్న బోర్డు
తొలి నుంచి వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీలో మరో వివాదం తెరపైకి వచ్చింది. నిన్నమొన్నటి వరకు ట్రోఫీ జరుగుతుందా? లేదా? అన్న సందిగ్ధత నెలకొంది. అయితే, ఎట్టకేలకు పాక్ క్రికెట్ బోర్డు హైబ్రిడ్ మోడల్‌కు అంగీకరించడంతో సస్పెన్స్ వీడిపోయింది. అంతా సవ్యంగానే ఉందనుకున్న వేళ మరో వివాదం తెరపైకి వచ్చింది.

ఈ ట్రోఫీకి పాకిస్థాన్ ఆతిథ్యమిస్తున్న నేపథ్యంలో పాల్గొనే జట్లు తమ క్రికెట్ కిట్లపై ఆతిథ్య దేశం పేరును ముద్రించడం తప్పనిసరి. అయితే, ఈ విషయంలో భారత్ మాత్రం ససేమిరా అంటోంది. తమ జట్టు కిట్లపై పాకిస్థాన్ పేరును ముద్రించేది లేదని బీసీసీఐ తేల్చి చెప్పినట్టు తెలిసింది. నిజానికి అంతర్జాతీయ క్రికెట్ మండలి (ఐసీసీ) ప్రొటోకాల్ ప్రకారం ట్రోఫీలో పాల్గొనే జట్లు అన్నీ తమ కిట్లపై ఆతిథ్య దేశం పేరును తప్పనిసరిగా ముద్రించాలి.

అయితే, బీసీసీఐ దీనిని వ్యతిరేకించడం వివాదానికి కారణమైంది. బీసీసీఐ తీరును పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) తీవ్రంగా తప్పుబట్టింది. బీసీసీఐ దీనిని రాజకీయం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో ఐసీసీ జోక్యం చేసుకుని సమస్యను పరిష్కరిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసింది. 

పాక్ విమర్శలను బీసీసీఐ తిప్పికొట్టింది. భారత్ తన మ్యాచ్‌లను దుబాయ్‌లో ఆడుతుందని, కాబట్టి ఆతిథ్య జట్టు పేరును కిట్‌పై ముద్రించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. అంతేకాదు, ఇలా చేయడం ఏమీ తప్పనిసరి కాదని వాదిస్తోంది. భారత జట్టు జెర్సీపై ‘ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ’ అని మాత్రమే ఉంటుందని తేల్చి చెప్పింది. 


More Telugu News